సాధారణ ఎన్నికల్లో గెలవడానికి కేసిఆర్ ఎన్ని వ్యూహాలు అమలుపర్చారో తెలియదు గానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో మాత్రం గెలవడానికి అంతకంటే ఎక్కువ వ్యూహాలని అమలు పరుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే అది కేవలం హుజూరాబాద్ ప్రజలు మాత్రమే…ఉపఎన్నిక ప్రభావంతో కేసిఆర్…హుజూరాబాద్ ప్రజలకు ఎన్ని వరాలు ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు. ఇంతవరకు ఏ అధికార పార్టీ…ఏ ఉపఎన్నికలో ఖర్చు చేయని విధంగా….టిఆర్‌ఎస్ హుజూరాబాద్‌లో ఖర్చు చేస్తుంది.
అసలు ఎన్ని రకాలుగా చూసిన దాదాపు 4 వేల కోట్ల వరకు హుజూరాబాద్ కోసం ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం ఈటల రాజేందర్‌ని ఓడించడానికే అని చెప్పాల్సిన పని లేదు. ఈటల ప్లేస్‌లో మరో నాయకుడు ఉంటే లైట్ తీసుకునేవారేమో గానీ, ఈటల ఉండటంతోనే కేసిఆర్…హుజూరాబాద్‌ని బాగా సీరియస్‌గా తీసుకున్నారు. మొన్నటివరకు తనపక్కనే ఉన్న నాయకుడు…భవిష్యత్‌లో తనకే పక్కలో బల్లెం మాదిరిగా తయారవతాడని భయపడుతున్నట్లు ఉన్నారు..అందుకే కేసిఆర్…ఈటలకు చెక్ పెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే హుజూరాబాద్ ప్రజలకు ఎన్ని వరాలు ఇచ్చిన… అవి కేవలం ఈటల రాజీనామా వల్లే అని జనాలకు కూడా క్లారిటీ ఉంది. అందుకే హుజూరాబాద్‌లో ఈటలకు ప్రజా మద్ధతు తగ్గడం లేదు. దీంతో కేసిఆర్…ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ, ఈటలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన చంద్రశేఖరుడు….మరో సరికొత్త ఎత్తుతో ముందుకొస్తున్నారట. హుజూరాబాద్‌లో గెలిస్తే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇస్తామనే కోణంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారట.
వీలు చూసుకుని చంద్రశేఖర్ కూడా అధికారికంగా గెల్లు మంత్రి పదవిపై ప్రకటన చేసే అవకాశం ఉందట. గతంలోనే హరీష్…. గెల్లుకు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ ఆ ప్రచారం ఎక్కువ చేయలేదు. ఎందుకంటే కేసిఆర్ దగ్గర నుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి… కానీ హుజూరాబాద్‌లో పరిస్తితి చూసి కేసిఆర్… గెల్లుని మంత్రిని చేస్తామని చెప్పేలా ఉన్నారు. అయితే ఇప్పటికే అనేక మంది నేతలకు మంత్రి పదవి హామీ ఇచ్చారు… ఆ హామీనే ఇంతవరకు నెరవేర్చలేదు… మరి ఈ హామీని ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చూడాలి.