చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. నిజానికి ఆయనేమో.. తనకు ఏ పాపం తెలియదని అంటారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆయన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయా ? అనే సందేహాలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి. గతంలో జడ్జికి సంబంధించిన భూములను ఆక్రమించే వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఆ తర్వాత ఇటీవల ఆయన సోదరుడిపై దాడి జరిగింది. ఈ పరిణామాల్లో పెద్దిరెడ్డి హస్తం ఉందనేది ప్రతిపక్షం టీడీపీ మాట.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాయడం మరింత వివాదానికి దారితీసింది. ఇవన్నీ ఇలా ఉంటే.. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఓ దళిత వ్యక్తి మద్యం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆ వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వంటి పరిణామం వెనుక కూడా పెద్దిరెడ్డి ఉన్నారని ప్రచారంలో ఉంది. ఇక, ఇసుక మాఫియా వెనుక కూడా గనుల శాఖ మంత్రిగా ఆయన పేరు బాగానే వినిపిస్తోంది. నిజానికి వాటిలో ఆయన పేరు లేదనేది పెద్దిరెడ్డి అనుచరుల వాదన, కానీ, ప్రతిపక్షాలు మాత్రం సాక్ష్యాలతో సహా ఆయనపై ఆరోపణలు చేస్తున్నాయి.
తాజాగా ఆయన ఎస్టేట్‌కు మునిసిపల్ అధారిటీనే రోడ్డు నిర్మించిందని, ఇది ఆయనకు ఇంజనీరింగ్ సిబ్బంది కానుకగా ఇచ్చిందనే మరో ప్రధాన విమర్శ ఇప్పుడు మరింతగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన అత్యంత స్వల్ప కాలంలోనే ఇలా ఇన్ని విమర్శల్లో చిక్కుకున్నమంత్రి వేరొకరు లేకపోవడం గమనార్హం. ఇవన్నీ ఇలా ఉంటే.. రాజకీయంగా ప్రత్యర్థులను టార్గెట్ చేయడం వదిలేసి.. సొంత పార్టీలోనే నేతలను కట్టడి చేస్తున్నారనే వాదన కూడా మంత్రిని ఇరకాటంలోకి నెట్టింది.
ఇటీవల సీఎం జగన్ తిరుమల పర్యటన పెట్టుకున్నప్పుడు యువ ఎమ్మెల్యేలు కొందరు జిల్లా సమస్యలపై ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తే.. వద్దని అడ్డు చెప్పారని మంత్రిపై విమర్శలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు నగరి ఎమ్మెల్యే రోజా పెద్దిరెడ్డిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేసేవారు. ఇప్పుడు రోజా మాత్రమే కాదు… ఐదారుగురు ఎమ్మెల్యేలు ఆయన తీరుపై గుస్సాగా ఉన్నారు. కొందరు ఈ విషయంపై జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు.
సొంత జిల్లాలో మాత్రమే కాదు తన శాఖా పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో వేలు పెడుతుండడం కూడా పెద్దిరెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే రగులుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ వివాదాల్లో పెద్దిరెడ్డి జోక్యం నేరుగా ఉండదని.. అయితే తెరవెనక మాత్రం ఆయన పేరుతో జరగాల్సినవి అన్ని జరిగిపోతుంటాయని.. ఆయన ఎవరిని ఎక్కడ తొక్కాలో… ఏ పని ఎలా చక్కబెట్టాలో తెలిసిన నేర్పరి అని వైసీపీలో వినిపించే గుసగుస..!
-vuyyuru subhash