నేడు తెలంగాణలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి షాపుల కోసం లాటరీ తీయనున్నారు. దీంతో ఎవరిని లక్కు వరిస్తుందో అని టెండర్ల వేసిన వారిలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 18 వరకు కొత్తగా మద్యం షాపుల కోసం 2 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాటరీ డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ మొదలు కానుంది. లాటరీద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్స్ కు 393, జనరల్ కేటగిరిలో 1834 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నారు. కాగా రాష్ట్రంలో మొదటిసారిగా రిజర్వేషన్ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు 67,849 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా సుమారుగా 1356.98 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ ప్రారంభం కానుంది.