దేశంలో అత్యధిక మొత్తంలో విరాళాలు ఇస్తున్న వ్యక్తుల జాబితాలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ మొదటి స్థానంలో నిలిచారు. 2020 సంవత్సరానికి గాను ఎడిల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రొపీ లిస్ట్ లో అజీం ప్రేమ్ జీ మొదటి స్థానంలో నిలిచారు. ఈయన ఏడాది కాలంలో మొత్తం రూ.7,904 కోట్ల విరాళాలు ఇవ్వడం విశేషం. అంటే రోజుకు దాదాపుగా రూ.22 కోట్లు అన్నమాట.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏటా ఖర్చు చేస్తున్న మొత్తానికి ఇది అదనం. ఇక సదరు లిస్ట్‌లో హెచ్‌సీఎల్ అధినేత శివ నాడార్ రెండో స్థానంలో నిలిచారు. ఈయన ఏడాది కాలంలో మొత్తం రూ.795 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఆ జాబితాలో మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నిలిచారు. ఆయన మొత్తం రూ.458 కోట్ల విరాళాలు అందజేశారు. ఇక కోవిడ్ నేపథ్యంలో ముకేష్ అంబానీ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరో రూ.5 కోట్ల చొప్పున విరాళాలు ఇచ్చారు.
కాగా సదరు లిస్ట్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా రూ.276 కోట్ల విరాళాలతో 4వ స్థానంలో నిలవగా, వేదాంత గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ అగర్వాల్ రూ.215 కోట్ల విరాళాలతో 5వ స్థానంలో నిలిచారు. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ పీఎం కేర్స్ ఫండ్‌కు కోవిడ్ పై పోరాటం కోసం రూ.400 కోట్ల విరాళం అందజేసింది. కాగా వేదాంత గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ అగర్వాల్ 2014 సెప్టెంబర్ లో తన సంపదలో 75 శాతాన్ని చారిటీల కోసం ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.