ఎన్టీఆర్-చిరంజీవిని వాడకుండా…మరి వైఎస్సార్?

-

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి తెలిసిందే…జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమాని అన్నట్లు నడుస్తారు. ఆయనని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతారు…ఎదుటవారిపై విరుచుకుపడతారు. ఇక చంద్రబాబుని ఏ విధంగా తిడతారో చెప్పాల్సిన పని లేదు. అలాగే జగన్‌ని విమర్శిస్తే పవన్‌ని సైతం వదలరు. తాజాగా వైసీపీ విముక్త ఏపీ చేస్తామని పవన్ కామెంట్ చేశారు…అలాగే జగన్‌ని గద్దె దించుతామని అన్నారు.

దీనిపై కొడాలి స్పందిస్తూ…పవన్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్యాకేజీకి పవన్ అమ్ముడుపోయారని అన్నారు.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ పీడ విరగడవుతుందని అన్నారు. అలాగే టీడీపీ-జనసేనలకు ఒక సవాల్ విసిరారు. ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేన పార్టీలకు ఉందా అని సవాల్ చేశారు. అంటే టీడీపీ…ఎన్టీఆర్ పేరు వాడకుండా, జనసేన…చిరంజీవి పేరు వాడకుండా రాజకీయం చేయాలని అంటున్నారు.

అయితే కొడాలి విసిరిన సవాల్‌పై ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు తీవ్రంగానే రియాక్ట్ అవుతున్నాయి. వైఎస్సార్ పేరు లేకుండా వైసీపీకి పోటీ చేసే దమ్ముందా? అని ప్రతి సవాల్ విసురుతున్నారు. పార్టీ పేరులోనే వైఎస్సార్ ఉందని, అసలు వైఎస్సార్ సానుభూతితోనే వైసీపీ నడుస్తోందని, వైఎస్సార్ పేరు లేకుండా వైసీపీ నడవలేదని అంటున్నారు. ముందు వైఎస్సార్ పేరు తీసి ఎన్నికలకు రావాలని టీడీపీ-జనసేన శ్రేణులు సవాల్ చేస్తున్నాయి.

ఇక టీడీపీ పెట్టింది ఎన్టీఆర్ అని, ఆయన ప్రస్తావన లేకుండా పార్టీ ఉండదని, కానీ చంద్రబాబు పేరుతోనే ఎన్నికలకు వస్తామని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నాయి. అటు చిరంజీవి అంటే అభిమానం ఉందని, ఇండస్ట్రీ పెద్దగా ఆయనపై గౌరవం ఉందని, కానీ ఆయన పేరుని వాడుకుని జనసేన రాజకీయం చేయడం లేదని…జనసేన శ్రేణులు అంటున్నాయి. అసలు గుడివాడలో ఎన్టీఆర్-వైఎస్సార్ పేరు లేకుండా నాని ప్రచారం చేయాలని సవాల్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి వారి రాజకీయం వారిదే అన్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version