మామూలుగా పూలు ఫ్రెష్ గా ఉంటే చాలా అందంగా ఉంటాయి. మగువలకు పువ్వులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొందరు రచయితలు అమ్మాయిలను పూలతో పోలుస్తారు.కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా పూలు అంటే ఇష్టం ఉంటుంది.పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన. పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది.ఈ అందమైన పూలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.అందుకే కొన్ని రకాల సౌందర్య సాదనాలలో, మందులలో కూడా వాడుతున్నారు.
అయితే.. మనిషిని, మనసును కట్టిపడేసిన పూలు వాడిపోయాక ఎవరైనా పక్కన పడేస్తారు.అలా కాకుండా అందమైన కళాకృతులకు ప్రాణం పోస్తోంది ఓ మగువ..భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నీలిమ మనకందరికీ కనిపించని ప్రకృతి అందాన్ని పసిగట్టింది. ఎండిన ఆకులు, వాడిన పువ్వులు సేకరిస్తూ అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తుంది.అవి ఇప్పుడు మనుషుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రకృతిలోని ప్రతి మార్పును నిశితంగా గమనిస్తే ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తే అద్వితీయ అనుభూతి కలుగుతుందని డా. నీలిమ చెబుతున్నారు. ఆకులను, పువ్వులను పుస్తకాల్లో పెట్టి ఎండిన తరువాత వాటిని కళాకృతులుగా రూపొందిస్తూ ప్రకృతి అందాన్ని ఆవిష్కరిస్తోంది. అంతటితో ఆగకుండా ఆ కళాకృతులను ఫోటోఫ్రేములుగా, గ్రీటింగ్ కార్డులుగా, బుకేలుగా మలిచి అందరి మనసును దొచుకుంటున్నారు.పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి కళాకృతులకు మంచి గిరాకీ ఉంటుందని చెబుతున్నారు డా. నీలిమ. పెట్టుబడి పెద్దగా అవసరం లేని ఈ కళను నేర్చుకుని.. ఇంటి నుంచే మంచి బిజినెస్ చేయోచ్చని ఆమె అంటున్నారు. ఆమె చిన్న ఆలోచన ఇప్పుడు యావత్ ప్రజలను ఆకట్టుకుంటుంది..