అంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపైనే మహిళ ప్రసవం!

-

అంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళుతున్న ఓ అంబులెన్స్ డీజిల్ కొరతతో మధ్యలోనే ఆగిపోయింది. ఆస్పత్రిని చేరే మార్గం లేక ఆ రోడ్డు మీదే గర్భిణీ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బందితో పాటు దగ్గర్లోని మహిళలు ఆమెకు పురుడు పోశారు. మధ్యప్రదేశ్ లో శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.

ఫోన్ చేసిన కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు. అయితే, డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, ఆ చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version