కేంద్రం అమ్మాయి వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనిర్ణయంతో అమ్మాయిల వివాహ వయస్సు అబ్బాయిలతో సమానం అయింది. 18 ఏళ్లకే పెళ్లిళ్లు చేయడం ద్వారా అమ్మాయిల కెరీర్ కు నష్టం వస్తుందని పలువురు అంటున్నారు. చిన్నవయస్సులోనే గర్భం దాల్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వాదిస్తున్నారు. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి జయ జైట్లీ నేతృత్వం వహించగా.. ప్రభుత్వ నిపుణులు డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసులపై వివాహ వయసును 21కి పెంచారు.
ఇదిలా ఉంటే జార్ఖండ్ మంత్రి అమ్మాయిల వివాహ వయసుపై వాఖ్యలు చేశారు. అమ్మాయిల కనీస వివాహ వయసును తగ్గించాలని జార్ఖండ్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి హఫిజుల్ హసన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిల శారీరక పెరుగుదలను ద్రుష్టిలో పెట్టుకుని 16 ఏళ్లకు తగ్గించాలని అంటున్నారు. ఒక వేళ అలా కుదరకపోతే ఇప్పుడున్న 18 సంవత్సరాలను ఉంచాలని అన్నారు.