గుడ్‌ న్యూస్‌.. వారి జీతాలు 170 శాతం పెంపు.. కేంద్ర ప్రభుత్వం!

-

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది జీతాలను 170 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, చైనా తదితర దేశాల సరిహద్దుల్లో రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల జీతాలను 100 నుంచి 170 శాతం మేర పెంచినట్లు కేంద్రం తెలిపింది. స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ విభాగాలు రెండింటిలోనూ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఈ జీతాల పెంపు వర్తిస్తుంది.

నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) ఆయా కార్మికులు, ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాన్‌ టెక్నికల్‌ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే వారికి ఇప్పటి వరకు నెలకు రూ.16,770 వేతనం ఇవ్వగా, ఇకపై రూ.41,440 వేతనం ఇవ్వనున్నారు. ఇక అదే జాబ్‌ చేసే వ్యక్తికి ఢిల్లీలో రూ.28వేల వేతనం ఇస్తున్నారు. ఇక సరిహద్దుల్లో అకౌంటెంట్‌గా పనిచేసే వారి వేతనం రూ.25,700 ఉండగా, అదిప్పుడు రూ.47,360కి పెరిగింది.

సరిహద్దుల్లో పనిచేస్తున్న సివిల్‌ ఇంజినీర్‌కు ఇప్పటి వరకు నెలకు రూ.30వేల వేతనం ఇచ్చారు. దాన్నిప్పుడు రూ.60వేలకు పెంచారు. మేనేజర్‌ స్థాయి ఉద్యోగులకు రూ.50వేలు ఇవ్వగా, దాన్నిప్పుడు రూ.1,12,800కి పెంచారు. సీనియర్‌ మేనేజర్‌ స్థాయి అధికారులు నెలకు రూ.1,23,600 వేతనం అందుకుంటారు. ఇక కార్మికులు, ఉద్యోగులకు హెల్త్‌, యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, ట్రావెలింగ్‌ అలవెన్స్‌, డియర్‌నెస్‌ అలవెన్స్‌, పీఎఫ్‌ కూడా ఇస్తారు. ప్రస్తుతం చైనాతో భారత్‌కు ఉన్న సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లో భారత్‌ పెద్ద ఎత్తున భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఈ జీతాల పెంపు వర్తించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version