వరల్డ్ కప్ 2023 లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఛాంపియన్ జట్లకు పసికూనలు అన్ని విభాగాలలో రాణిస్తూ ఓటమిని పరిచయం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లను అత్యధిక సార్లు సొంతం చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. కానీ ఈ వరల్డ్ కప్ లో మాత్రం ఆస్ట్రేలియాకు ఆశించిన ఆరంభం అయితే దక్కలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనూ ఇండియాపై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పైన 134 పరుగుల తేడాతో వరుసగా రెండవ ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ రెండు ఓటముల అనంతరం అందరూ కూడా ఇక ఆస్ట్రేలియా సెమీస్ కు చేరదా కష్టమే అనుకున్నారు. కానీ ఆసీస్ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో పుంజుకుని శ్రీలంక మరియు పాకిస్తాన్ లను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
నేడు నెదర్లాండ్ తో మ్యాచ్ లోనూ బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసి విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచినా ఆసీస్ కు సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగు మ్యాచ్ లు గెలిస్తే సెమీస్ లోకి వెళ్లడం లాంఛనమే.. మరి సెమీస్ కు చేరనున్న జట్లలో ఇంకా పోటీ విపరీతంగా ఉండేలా ఉంది.