మన దేశం నుంచి ప్లాస్టిక్ ని పారద్రోలడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి తగిన విధంగా ఏదోక వినూత్న ఆలోచనతో ముందుకి వస్తున్నారు. సరికొత్త ఐడియాతో ముందుకి వచ్చి ప్లాస్టిక్ ని మన దేశం నుంచి పూర్తిగా పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సిని ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా దీనిపై విశేషంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారు.
తెలంగాణలోని ఓ సర్పంచ్ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, సరికొత్త ఆలోచనతో ముందుకి వచ్చారు. ఇప్పటి వరకు రోజా కేజీ ప్లాస్టిక్‌కు కేజీ బియ్యం ఇస్తూ వచ్చారు కొందరు. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏకంగా కేజీ ప్లాస్టిక్‌కు కేజీ చికెన్ ఇస్తామని సంచలన ప్రకటన చేసారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమం ముగింపు సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లిలో గ్రామ సభ నిర్వహించగా,
ఈ సందర్భంగా సదరు గ్రామ సర్పంచ్ కాయిత రాములు ఈ ఆలోచనతో ముందుకి వచ్చారు. ఈ ఆలోచనకు వెంటనే మంచి స్పందన వచ్చేసింది. ఆదివారం ఒక్క రోజే ప్రజలు సుమారు పది కేజీల వరకు ప్లాస్టిక్ తీసుకొచ్చి పది కేజీల చికెన్ తీసుకువెళ్ళారు. ఈ ఆలోచనపై పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇలాంటి ఆలోచన వలనే మార్పు సాధ్యమవుతుందని ప్రజలు అందరూ కూడా ఇలాంటి ఆలోచన చెయ్యాలని కోరుతున్నారు