రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించాలంటూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టారని అన్నారు ఏపీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల. విజయసాయి ప్రైవేట్ బిల్లు పెట్టారంటే.. ప్రస్తుతం అధికారం లేదనే కదా? అని ప్రశ్నించారు. లేని అధికారంతో ఇప్పుడు అసెంబ్లీలో ఇలాంటి బిల్లు పెట్టలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతే నని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు అంశం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి వచ్చిందని అన్నారు.
న్యాయస్థానం తీర్పులను ఉల్లంఘించాలనుకోవడం మూర్ఖత్వమేనని అన్నారు యనమల. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగపరంగా పెట్టాలి కాబట్టి పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యల కోసం కాదన్నారు. అమరావతిపై అవగాహన లేని ఒక్కో మంత్రి ఒక్కో పొంతనలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారుు. దీనిపై చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నామని.. చర్చకు రాలేకనే మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు, అమరావతి, పోలవరం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం వంటి అనేక ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుబడతామన్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తామనే ధోరణి ప్రభుత్వానికి సరికాదన్నారు.