ఆ విష‌యంలో టీడీపీని ఫాలో అవుతున్న వైసీపీ.. ప్ర‌తిఫ‌లం త‌ప్ప‌దా..?

-

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు..ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారికి సేవ చేయాలనేది ప్రాథమిక నియమం. ఈ క్రమంలోనే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా సేవ చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో స్వార్థం పెరిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ పని ద్వారా తమ పార్టీకి ఎంత లాభం? రాజకీయంగా ఎంత వరకు లబ్ధి జరుగుతుంది? అనే విషయాన్ని అంచనా వేసుకున్నాకే పనులు చేస్తున్నారు. ఈ విషయాలను బహిరంగ పరుస్తున్నారు కూడా.

గతంలో ఏపీలో ఇలాంటి సంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేశారని చెప్పొచ్చు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇవ్వబోనని, అక్కడ ఎందుకు అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి ప్రజా వ్యతిరేకతను బోలెడంత మూట కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల్లో ఘోరంగా ఓడిపోయింది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ. తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే వైసీపీ కూడా టీడీపీ బాటలోనే పయనించేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ చెప్పిందే చేయాలని ఇటీవల అధికారులకు నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉన్నది వైసీపీఅని ప్రతీ ఒక్కరు గుర్తించుకోవాలని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల ద్వారా ఒకప్పటి చంద్రబాబు వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయని కొందరు అంటున్నారు. ప్రజలు ఓట్లేయడం ద్వారానే ఎమ్మెల్యే అయిన సంగతి నల్లపురెడ్డి మరిచిపోయి ఉంటారని మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. గ్రామసర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కేవలం ఎన్నికల వరకే పార్టీలుగా ఉండాలని, ఒకసారి గెలిచారంటే పార్టీని పక్కనబెట్టాలని ప్రతిపక్షం, స్వపక్షం అని చూడకుండా అందరికీ సేవ చేయాలని, ఇలా చేయడం ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version