ఆయన సీనియర్ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. ఉన్నట్టుండి సొంత జిల్లాలోని మంత్రులతోపాటు పక్క జిల్లా మంత్రులపైనా ఒంటి కాలిపై లేస్తున్నారు. అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు ఆ సీనియర్ నాయకుడు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి. నిరసన గళం వినిపించడంలో ఏమాత్రం సంకోచించరనే ముద్ర ఉంది. అది సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా.. మంత్రులైనా ఆయన దృష్టిలో ఒక్కటే. ప్రస్తుతం జిల్లా అభివృద్ధికి కారణమయ్యే ప్రాజెక్టులు పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయని ఆవేదన చెందుతున్న ఆయన నేరుగా మంత్రులను ఢీకొడుతున్నారు.
జిల్లా రాజకీయ నాయకుల్లో సీనియర్ అయిన మహీధర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి నాలుగోసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగానూ పనిచేశారు మహీధర్‌రెడ్డి. ఆ సమయంలోనే కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చారాయన.
రామాయపట్నం ఓడరేవు వస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పడతాయని.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించారు మహీధర్‌రెడ్డి. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం.. టీడీపీ అధికారంలోకి రావడంతో పోర్టు పక్కకు వెళ్లిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. మహీధర్‌రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పోర్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే రామాయపట్నంలో పోర్టు నిర్మించి.. పరిశ్రమలు మాత్రం పక్క జిల్లా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారన్న ప్రచారం మహీధర్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించిందట.
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు అనీల్‌కుమార్, మేకపాటి గౌతంరెడ్డిలు పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి పోర్టు, పరిశ్రమల నిర్మాణంపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. ఇది తెలిసినప్పటి నుంచి అగ్గిమీద గుగ్గిలం అవుతన్నారు మహీధర్‌రెడ్డి. అక్కడా ఇద్దరు మంత్రులు ఉన్నారు.. ఇక్కడా ఇద్దరు మంత్రులు ఉన్నారు.. అక్కడ ఎంత యంత్రాంగం ఉందో.. ఇక్కడా అంతే యంత్రాంగం ఉంది.. నెల్లూరు ఏం పొడుగని పరిశ్రమలు అక్కడ పెడతారు అని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై జిల్లా మంత్రులకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు మహీధర్‌రెడ్డి. జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లపై ఆయన గుర్రుగా ఉన్నారట. ఆ జిల్లా మంత్రులను.. ఈ జిల్లా మంత్రులను ఈ అంశంలో సందర్భం వచ్చిన ప్రతీసారి ఏకి పారేస్తున్నారు. పనిలో పనిగా అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారట. దీంతో ప్రకాశం, నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో మహీధర్‌రెడ్డి చర్చగా మారారు.