ఫస్ట్ కాజ్ : మై హోం అధినేత, తెలంగాణ, ఆంధ్రా రాజకీయాలను సైతం ప్రభావితం చేసే పారిశ్రామిక శక్తి, మీడియా దిగ్గజం అయిన రామేశ్వర్ కు రాజ్యసభ పదవి.
వైసీపీ అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఓ విశిష్ట మార్పు అని కూడా అంటారు జగన్. ఆ మార్పు ఆ తీర్పు ఎలా ఉన్నా కూడా త్వరలో ఓ ఆసక్తిదాయక పరిణామం నెలకొననుంది. కేసీఆర్ దోస్తు మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు జూపల్లి రామేశ్వరరావుకు రాజ్యసభ ఆఫర్ చేయడంతో కొత్త ఆసక్తి ఒకటి రేగుతోంది. ఆ వివరం ఈ కథనంలో..
ఎప్పటి నుంచో వైసీపీ నుంచి నలుగురికి రాజ్యసభ స్థానాలు ఖరారయ్యే అవకాశం ఉందన్న వార్తలు మరియు ఊహాగానాలూ వస్తున్నాయి. వార్త అయితే నిజం. ఊహ అయితే అబద్ధం. వార్త ఎలా నిజం అంటే సంఖ్యా బలంకు అనుగుణంగా జూన్ లో వైసీపీ తరఫున నలుగురు రాజ్యసభలో అడుగిడడడం. ఊహ ఏంటంటే ఇప్పటికే చాలా మంది పేర్లు నాలుగు సీట్ల కోసమే వినిపించి ఏవీ ఖరారులో లేకపోవడం. ఓ విధంగా చెప్పాలంటే ఇదొక మైండ్ గేమ్.
ఇప్పటిదాకా ఆ నలుగురిలో ఒకరు కన్ఫం అయ్యారు. ఆమె పేరు ప్రీతీ అదానీ (ప్రముఖ కుభేరుడు, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ జీవన సహచరి). ఇప్పుడు ఆమె స్థానం స్థిరం చేయగా మరో పేరు వినపడుతోంది. అదే జూపల్లి రామేశ్వరరావుది. ఆయన ఎప్పటి నుంచో ఆంధ్రా, తెలంగాణ నేతలకు దగ్గరగా ఉంటున్నారు. ప్రస్తుతం దిగ్గజ మీడియా అధినేతగా కూడా మారారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ఆహాలో కూడా ఆయన కుమారుడితో పెట్టుబడులు పెట్టించారు.
ఇప్పటిదాకా ఎవ్వరూ ఊహించని రీతిలో ఈయన పేరు వినపడడంతో వైసీపీ ఆశావహులకు చుక్కలు కనపడుతున్నాయి. ఈ ఆశావహుల జాబితాలో శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి ఉన్నారు. అదేవిధంగా సినీ నటుడు అలీ ఉన్నారు. అదేవిధంగా ఒకరిద్దరు కమ్మ సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. వీరితో పాటే సాయిరెడ్డి కూడా ఉన్నారు. మరి ! మిగిలిన రెండు స్థానాలకూ ఎవరిని ఎంపిక చేయనున్నారో అన్నదే ఇప్పుడిక ఆసక్తిదాయకం.