వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. దాదాపు ప్రతివారు ఏదో ఒక సందర్భంలో పసుపు గణపతిని ఆరాధించే ఉంటారు. కానీ శాస్త్రంలోని వివరాలను తెలుసుకుని ఆచరిస్తే ఆ ఫలితం తప్పక అనుభవంలోకి వస్తుంది. పసుపుతో చేసిన లేదా పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అని వ్యవహరిస్తారు.
ఈ రూపంలో గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు.
ఈ గణపతిని ఆరాధిస్తే కలిగే లాభాలు
జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీని 21 సార్లు చొప్పున పఠించాలి.
– కేశవ