”క‌ష్టాలు చుట్టుముట్టిన‌ప్పుడే.. దృఢత్వం తెలుస్తుంది..” చ‌దవాల్సిన క‌థ‌..!

-

ఒక రోజు ఓ యువ‌తి త‌న తండ్రి వ‌ద్ద త‌న బాధ‌ను చెప్పుకుని వాపోతుంది. త‌న‌కు ఏదీ క‌ల‌సి రావ‌డం లేద‌ని, ఒక స‌మ‌స్య ప‌రిష్కారం అయింద‌నుకునే లోపే మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతుంద‌ని చెప్పి త‌న తండ్రి వ‌ద్ద బాధ‌ను తెలియ‌జేస్తుంది. అత‌ను ఒక చెఫ్‌. తన కుమార్తెను ఇంట్లోని కిచెన్‌లోకి తీసుకెళ్లి.. స్ట‌వ్ మీద 3 పాత్ర‌లు పెట్టి వాటిల్లో నీళ్లు పోసి మ‌రిగిస్తుంటాడు.

ఆ యువ‌తికి త‌న తండ్రి ఏం చేస్తున్నాడో అర్థం కాక అత‌న్నిఅలాగే చూస్తుంటుంది. మ‌రుగుతున్న నీళ్ల‌లో అత‌ను ఒక పాత్ర‌లో ఒక ఆలుగ‌డ్డ వేస్తాడు. ఇంకో పాత్ర‌లో కోడిగుడ్డు వేస్తాడు. మ‌రొక పాత్రలో కాఫీ గింజ‌లు వేస్తాడు. దీంతో ఆ యువ‌తికి మ‌ళ్లీ ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. త‌న తండ్రి ఏం చేస్తున్నాడా.. అని ఆమె ఒకింత ఆశ్చ‌ర్యంగా, ఒకింత అనుమానాస్ప‌దంగా అత‌ని వైపు చూస్తుంది.

చివ‌రకు 15 నిమిషాలు ఆగాక‌.. అత‌ను స్ట‌వ్‌ను ఆర్పి ఒక్కో పాత్ర‌లో ఉన్న ఆయా ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు తీస్తాడు. ఆలుగ‌డ్డ, కోడిగుడ్డు పూర్తిగా ఉడికి ఉంటాయి. కాఫీ గింజ‌ల నుంచి బ్లాక్ కాఫీ త‌యారై మంచి వాస‌న వ‌స్తుంటుంది. వాటిని ట‌చ్ చేసి, రుచి త‌న‌కు చెప్ప‌మంటాడు. దీంతో ఆ యువ‌తి ముందుగా ఆలుగ‌డ్డ‌ను స్పృశిస్తుంది. అది మెత్త‌గా, మృదువుగా ఉంటుంది. కోడిగుడ్డును త‌రువాత ముట్టుకుంటుంది. అది బాగా ఉడ‌కింది క‌నుక‌.. కొంచెం గ‌ట్టిగా ఉంటుంది. ఇక ఆమె కాఫీ తాగి చూస్తుంది. అది చ‌క్క‌ని వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అయితే త‌న తండ్రి అలా ఎందుకు చేయ‌మ‌న్నాడో అర్థం కాక మ‌ళ్లీ ఆమె త‌న తండ్రి వైపు చూస్తుంది. అప్పుడు అత‌ను కూడా త‌న కుమార్తె వైపు చూసి బ‌దులిస్తాడు.

ఆలుగ‌డ్డ ముందుగా గ‌ట్టిగా ఉండేది.. కానీ మ‌రుగుతున్న నీటిలో కొంత సేపు ఉన్నాక అది ఉడికి మెత్త‌గా మారింది.. కోడిగుడ్డు ముందు సున్నితంగా, కింద ప‌డేస్తే ప‌గులుతుందా అన్న‌ట్లు ఉండేది. కానీ నీటిలో మ‌రిగించాక అది గ‌ట్టిప‌డింది. దాన్ని కింద ప‌డేసినా ఇక దానికి ఏమీ కాదు. ఇక కాఫీ గింజ‌లు పూర్తిగా నీటిలో క‌రిగిపోయి ఓ కొత్త ప‌దార్థం ఏర్ప‌డింది. అయితే ఈ మూడు ప‌దార్థాలు త‌మ స్వ‌భావాన్ని మార్చుకోవ‌డానికి కార‌ణం మాత్రం ఒక్క‌టే.. మ‌రుగుతున్న నీళ్లు.. నీకు వ‌స్తున్న క‌ష్టాలు కూడా అలాంటివే.. వాటిని త‌ట్టుకుని నిన్ను నువ్వు మార్చుకుని విజ‌యం వైపు ప్ర‌యాణించాలి. మ‌న‌స్సు దృఢంగా ఉండాలి. ఏ అవాంత‌రాల‌కు కుంగి పోకూడ‌దు. చివ‌ర‌కు త‌ప్ప‌క విజ‌యం సాధిస్తావు. చేసే ప‌నిలో ఫ‌లితం ఉంటుంది.. అని తండ్రి అనే స‌రికి ఆ యువ‌తి పెదాల‌పై చిరున‌వ్వు తొణికిస‌లాడుతుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version