కరోనా వైరస్‌ను అంతం చేసే ఓ సరికొత్త డివైస్‌ను బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఆవిష్కరించింది. ఆ డివైస్ పేరు.. స్కేలీన్ హైపర్‌చార్జ్ కరోనా కానన్ (షైకోక్యాన్). బెంగళూరుకు చెందిన డి స్కెలీన్ అనే కంపెనీ ఈ డివైస్‌ను తయారు చేయగా.. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యురోపియన్ యూనియన్ (ఈయూ)ల నుంచి అనుమతి లభించింది. ఈ క్రమంలో త్వరలో ఈ డివైస్‌ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయనున్నారు.
షైకోక్యాన్ డివైస్ చిన్న డ్రమ్‌ను పోలి ఉంటుంది. దీన్ని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, హోటళ్లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఎక్కడైనా పెట్టవచ్చు. అక్కడి ప్రాంతం మొత్తాన్ని ఈ డివైస్ శానిటైజ్ చేస్తుంది. ఆయా ప్రదేశాల్లో గాలిలో ఉండే కరోనా వైరస్ 99.9 శాతం వరకు నశిస్తుంది. కరోనా వైరస్‌లో ఉండే స్పైక్ ప్రొటీన్‌ను ఈ డివైస్ నాశనం చేస్తుంది. అందువల్ల వైరస్ నశిస్తుంది. ఆయా ప్రదేశాల్లో ఇక ఎవరు తిరిగినా వారికి కరోనా వ్యాపించదు.
కాగా షైకోక్యాన్ డివైస్ నుంచి భారీ సంఖ్యలో ఎలక్ట్రాన్లు విడుదల అవుతాయి. అవి కరోనా వైరస్‌ను నాశనం చేస్తాయి. కరోనా ఉన్నవారు దగ్గినా, తుమ్మినా వారి నుంచి వెలువడే వైరస్ కణాలను ఈ డివైస్ నాశనం చేస్తుంది. దీంతో ఆ ఏరియా మొత్తం శానిటైజ్ అవుతుంది. దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించదు. అయితే ఈ డివైస్ ప్రదేశాలను కరోనా లేకుండా శానిటైజ్ మాత్రమే చేస్తుంది. కరోనాకు చికిత్స అందించదు. కానీ ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక ఈ పరికరానికి అత్యవసర సేవల కింద ఎఫ్‌డీఏ, ఈయూలు అనుమతులు ఇచ్చాయి. సాధారణంగా ఇలాంటి పరికరాలకు 26 రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి హాని ఏమైనా కలుగుతుందా, ఇతర పరికరాల పనితీరుకు ఆటంకం ఏర్పడుతుందా.. తదితర టెస్టులు చేశాకే ఇలాంటి పరికరాలకు ఆయా సంస్థలు అనుమతులు ఇస్తాయి. కానీ ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా సంస్థలు దీనికి త్వరగా అనుమతులు ఇచ్చాయి. దీంతో త్వరలోనే పారిశ్రామికంగా ఈ పరికరాన్ని ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నారు. అయితే పరికరం ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.