ఇప్పుడు ట్రెండ్ అంతా ఓటీటీలదే. థియేటర్ లోకి వచ్చిన సినిమా నెల తిరక్కుండా ఓటీటీలోకి వస్తోంది. భాషా భేదం లేకుండా ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉంటే ఏ భాషా సినిమా అయినా చూస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలకు ఆదరణ డబుల్ అయింది. అందుకే ఒకప్పుడు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఉండే ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్ ను ఇస్తున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5, ఆహా, వూట్, సోనీ లివ్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే లిస్ట్ ఆకాశాన్నంటుతుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరింది యూట్యూబ్. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అంటూ ఇన్ స్టా రీల్స్ తో పోటీ పడుతూ దూసుకెళ్తున్న యూట్యూబ్ ఇప్పుడు ఓటీటీ తరహాలో వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించడానికి రెడీ అయింది.
మరో సరికొత్త ఫీచర్ తో .. కొంగొత్త సేవలు అందించడానికి యూట్యూబ్ రెడీ అవుతోంది. ఓటీటీ తరహాలో వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం యూట్యూబ్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోకు, యాపిల్ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయట. యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ సేవల్లో భాగంగా కొత్త సర్వీస్‌లను ప్రారంభించనుంది. గత ఏడాదిన్నర కాలంగా వీడియో స్ట్రీమింగ్ సేవలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సేవలను యూజర్లకు పరిచయం చేస్తారని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎక్కువ మంది యూజర్లు కేబుల్, శాటిలైట్ టీవీ సర్వీసులకు బదులుగా సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీ, స్ట్రీమింగ్ సేవలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో యూజర్ల అభిరుచికి తగ్గట్లుగా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు స్ట్రీమింగ్ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కూడా కొత్తగా వీడియో స్ట్రీమింగ్ కోసం ఆన్‌లైన్ స్టోర్‌ను తీసుకురానుంది.
ఇటీవలే యూట్యూబ్ పెద్ద వీడియోల నుంచి సులువుగా షార్ట్స్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ పెద్ద వీడియోల నుంచి 60 సెకన్ల కన్నా తక్కువ నిడివితో షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా క్రియేట్ చేసిన షార్ట్స్‌కు కంటెంట్ డెవలపర్ ఎక్కువ నిడివి ఉన్న వీడియో లింక్‌ను యాడ్ చేయొచ్చు. దాంతో షార్ట్స్ పూర్తయిన వెంటనే ఒరిజినల్ వీడియోకు వ్యూయర్‌ను రీడైరెక్ట్ చేస్తుందని యూట్యూబ్ తెలిపింది.