ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు మరో శుభవార్త.. సీఎం వైఎస్ జగన్ మరో పదివేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ సర్కారు ఇటీవలే భారీ సంఖ్యలో గ్రామ వాలంటీర్ల పోస్టులు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు లక్షల వరకూ గ్రామ వాలంటీర్లను నియమించారు. గ్రామంలోని ప్రతి 50 కుటుంబాలకు ఓ గ్రామ వాలంటీరు ఉంటారు.
అయితే కొన్ని నెలల క్రితం నియమించిన ఈ ప్రక్రియలో వివిధ కారణాల కారణంగా 9,648 పోస్టులు మిగిలిపోయాయి. ప్రభుత్వం వీటిని కూడా త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించింది. వివిధ కారణాలతో భర్తీ కాని 9,648 గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది.
ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకు చొప్పున 1,94,592 మంది వాలంటీర్ల నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.