సమ్మెపై ఇటు ఆర్టీసీ కార్మికులు.. అటు ప్రభుత్వం పట్టు వీడని విక్రమార్కులుగా వ్యవహరిస్తుండటంతో… ప్రజారవాణా సమ్మెకు ఫుల్ స్టాప్ పడేలాగా కనిపించడం లేదు. పట్టువిడుపుల్లేవని ఒకరు.. వెనక్కు తగ్గేది లేదని మరొకరు.. భీష్మించుకోవడంతో ప్రయాణీకుల ఇబ్బందులు కూడా తప్పడం లేదు. అయితే ఓ వైపు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతుండగా.. మరోవైపు విధులకు రాని వారితో ఎలాంటి చర్చలుండవని సర్కారు తేల్చిచెప్పింది. ఇటు నేటి నుంచి వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తామని. యూనియన్లు ప్రకటించగా, వచ్చే రెండు రోజుల్లో రోడ్లపైకి వందశాతం బస్సులు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు ఇవాళ వంటావార్పుతో తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇటు ఆర్టీసీ సమ్మెకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విద్యార్థీ, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. రేపు విద్యార్థీ యూనియన్లు బస్ భవన్‌ను ముట్టడించనున్నారు. అలాగే మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు డీపీఓ కార్యలయాల దగ్గర నిరసనలు వ్యక్తం చేయనున్నారు.