ఏపీలో జగన్ సీఎం అయ్యారు కానీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, జగన్ పాలనపై ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు, దోపిడీ మొదలయ్యింది, నవరత్నాలు అమలు అయ్యే అవకాశమే లేదు అంటూ ఒక పక్క ఏపీ సీఎం జగన్ పై మరో పక్క కేసీఆర్ పాలన కి తెలంగాణా ప్రజలు చరమ గీతం పాడుతారు, తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుంది, టీఆర్ఎస్ పనైపోయింది అంటూ మరో పక్క ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం లపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా
ఏపీలో టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. సందట్లో సడేమియాలా ఎన్నో ఏళ్ళ నుంచీ కాచుకుని కూర్చున్న బీజేపీ, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వేలో,తలో పెట్టి దూరిపోదాం అనే కోణంలో అటు కేసీఆర్, ఇటు జగన్ లపై విమర్శలు సందిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ చొచ్చుకుపోయే అవకాశం లేకపోవడంతో అధికశాతం తెలంగాణా సీఎం పైనే దృష్టి ఎక్కువగా పెడుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల సీఎం లకి పంటి కింద రాయిలా ఉన్న ప్రతిపక్షాలకి ఓ సర్వే షాక్ ఇచ్చింది.
Naveen Patnaik with 81% overall satisfaction rating is India's most popular Chief Minister #DeshKaMood pic.twitter.com/346qUUOnpT
— VDPAssociates (@VDPAssociates) August 15, 2019
వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన మోస్ట్ పాపులర్ సీఎం ఇన్ ఇండియా సర్వేలో ఊహించని విధంగా జగన్ కి మూడవ స్థానం, తెలంగాణా సీఎం కేసీఆర్ కి ఐదవ స్థానం దక్కాయి. టాప్ 5 లో మన తెలుగు రాష్ట్రాల సీఎం లు స్థానాలు దక్కించుకోవడం మరొక విశేషం. మొదటి స్థానంలో ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఉండగా , రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నిలిచారు. దేశ వ్యాప్తంగా జగన్ పాలన పట్ల దాదాపు 71 శాతం మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేశారట. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు వారిని ఆకట్టుకున్నాయని తెలిపారట.
ఈ సర్వేలపై వైసీపీ నేతలు స్పందిస్తూ తెలుగు ప్రజలతో పాటు , దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నవరత్నాలు ,జగన్ పాలనపై పాజిటివ్ గా ఉంటే , కుళ్ళు రాజకీయాలు చేస్తూ టీడీపీ , జనసేన పార్టీలు జగన్ పై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ పాలనని చూడాలని హితబోధ చేస్తున్నారు . అంతేకాదు జగన్ పై ఆరోపణలు చేస్తున్న బాబు , పవన్ లకి ఈ సర్వే రిపోర్ట్ సమాధానం అంటూ చురకలు అంటిస్తున్నారు.