ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పుడు భారత్‌ను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేందు కు రెడీ అయింది. దేశంలో ఒక్కరోజే మూడు పదులు దాటిన మరణాలు.. వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ప్రజలను,ప్రభుత్వాలను కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలో కరోనా ను సీరి య స్‌గా భావించని అమెరికా ఇప్పుడు మృత్యుఘోషతో అల్లాడిపోతోంది. ఇటలీలోనే మరణాలు లెక్కువని అం దరూ నోరు నొక్కుకున్న పరిస్థితిని ఇప్పుడు అగ్రరాజ్యం దాటేసింది. గంటకు 83 మంది చనిపోతున్నారని అక్కడి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికలోనేపరిస్థితి ఇలా ఉంటే.. మరి ఇంకా అభివృద్ది చెందుతున్నామని చెప్పుకొంటున్న మన పరిస్థితి ఏంటి?
ఇక్కడ అమెరికా లాంటి పరిస్థితి వస్తే.. దేశంలో సగం మంది మాత్రమే మిగులుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న తీరు ప్రస్తుతానికి బాగున్నా.. రాబోయే రోజుల్లో మాత్రం మరింత తీవ్రస్తాయిలో కరోనాపై యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వాస్తవం. ఈ విషయాన్ని ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. లాక్‌డౌన్ ప్రకటించి మేలు చేసింది. అయినప్పటికీ.. దేశంలో కరోనా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఒడిసా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు తమ స్థాయిలో చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. మాస్కులను నిర్బంధం చేశాయి.
అయితే, ఇదే పరిస్థితి ఇంత తీవ్రంగా ఏపీలో లేనప్పటికీ.. ముందు జాగ్రత్తల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను మాత్రం దేశం మొత్తం అభినందిస్తోంది. వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన జగన్.. కరోనా కట్టడి విషయంలో ఆది నుంచి కూడా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. దీంతో మరణాల విషయంలో ఏపీలో మంచి కట్టడి సాధించింది. అయితే, మున్ముందు పరిస్థితి ఇప్పటిలా ఉండేది కాదని భావిస్తున్న ప్రభుత్వం.. మరింతగా కరోనాపై పోరును పెంచేందుకు ప్రయత్నించింది. దీనిలో భాగంగా రెడ్ జోన్లలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి మరింతగా కట్టడి చేస్తోంది. అదేసమయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవన్నీ ఒక భాగమైతే..ఇప్పుడు తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం మరింతగా దేశంలో ప్రశంసలు పొందుతోంది. అదే ప్రజలందరికీ మాస్కులను ప్రభుత్వమే పంచిపెట్టడం. అది కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున ఇవ్వాలని , మాస్కుల ధారణను నిర్బంధం చేయాలని జగన్ నిర్ణయించారు. నిజానికి ఆర్ధికంగా బలంగా ఉన్న ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ, జగన్ మాత్రం ఆర్ధిక పరిస్థితి కన్నా రాష్ట్ర ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 16 కోట్ల మాస్కులను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడమే కాకుండా అంతే వేగంగా ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ఇప్పుడున్న ధరల మేరకు ఒక్కొక్క మాస్కు రూ.10 వేసుకున్నా.. లేదా బల్క్‌గా కొనుగోలు చేసినా.. తయారు చేసినా.. ఎంత లేదన్నా. . 16 కోట్ల మాస్కులకు రూ.50 కోట్లు పైగానే ఖర్చుకానుందని అధికారులు లెక్కలు తేల్చారు. అయినాకూడా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజల ప్రాణాల కోసం ఆమాత్రం ఖర్చు చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతోపాటు .. రాబోయే రోజుల్లో జగన్‌ను మరిన్ని రాష్ట్రాలు అనుసరించడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.