ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 5వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం జరగనుంది. దీని ద్వారా ప్రతీ రైతుకు ఏడాదికి 12,500 రూపాయాలు సాయంగా అందించనుంది. అయితే, ఇందులో ఏపీ ప్రభుత్వం ఆరు వేల కోట్లు..కేంద్ర సాయం ఆరు వేల కోట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలసిందిగా సీఎం కోరనున్నారు.
అలాగే మోదీతో భేటీలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ఇక.. ఏపీలో ప్రస్తుతం విద్యుత్ కోతలకు కారణాలను వివరిస్తూ..తెలంగాణ నుండి బొగ్గు తీసుకుంటున్న విషయం అదే విధంగా కేంద్రం నుండి అందించాల్సిన సాయం పైన నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.