వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల.. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు వైఎస్ షర్మిల… ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో రైతు దీక్ష చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులకు రాష్ట్రాన్ని పాలించడం రావడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాకనే ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు అది చేయకుండా.. ధర్నాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రైతుల కోసం పోరాటం అంటున్న కేసీఆర్.. అప్పుడు ఢిల్లీలో ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల కోసం ఆలోచిస్తే.. ఆనాడే సంతకం చేయకుండా ఢిల్లీలో ధర్నా చేసే వారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదని అన్నారు. అందుకే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు.