వైఎస్ వివేకానంద హత్య కేసు ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసు దర్యాప్తు జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదుచేశారు. ఈ కేసు దర్యాప్తును అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె కోరారు. ప్రతివాదులుగా సీబీఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డీజీపీలను చేర్చారు.
2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మూడేళ్లు దాటిపోయినా… అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు వెల్లడికాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత.. సుప్రీంకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ సునీత రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినా తరువాత ఉపసంహరించుకున్నారు.