కరోనా సంక్షోభంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం నిధులను విడుదల చేస్తూ ప్రజలను ఆదుకుంటుంది. ఇప్పటికే అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల అకౌంట్లోకి వైఎస్ ఆర్ నేతన్న హస్తం కింద డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో తాజాగా వైయస్సార్ నేతన్న నేస్తం మూడో ఏడాది డబ్బులు ఈరోజు పడనున్నాయి. రాష్ట్రంలోని అర్హులైన 80,032 మంది చేనేత కార్మికుల ఖాతాలోకి డబ్బులు ఉన్నాయి.
మొత్తం రూ 192.08 కోట్లను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయ నున్నారు. ఇది ఇలా ఉంటే మగ్గం కలిగిన అర్హులైన రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వైసిపి ప్రభుత్వం ఏడాదికి ఇరవై నాలుగు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఐదేళ్లలో మొత్తం రూ. 1,20000 చొప్పున ప్రతి కుటుంబానికి సహాయం చేయనుంది. అయితే ఇప్పటికే రెండుసార్లు ఏపీ సర్కార్ చేనేత కార్మికుల ఖాతాలోకి డబ్బులు జమ చేసింది. ఈ పథకం ద్వారా నేతన్నల అభివృద్ధే లక్ష్యం అని సీఎం జగన్ ప్రకటించారు.