ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ చేస్తున్న కొన్ని పనులపై తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్, మద్యం నియంత్రణకు, డబ్బు నియంత్రణ కు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. స్థానిక సంస్థల్లో మద్యం, డబ్బు అనే మాట ఎలాంటి పరిస్థితుల్లోను వినపడకూడదు అని వినపడితే అనర్హులుగా ప్రకటించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.
మన రాష్ట్ర ఎన్నికలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మరి ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు గాని జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం ఆదర్శంగా నిలవకపోయినా విమర్శలకు వేదిక అవుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో లో ఒక వ్యక్తి మద్యం సీసాలను టీడీపీ అభ్యర్ధి ఇంట్లో పెట్టాడు.
ఆ అభ్యర్ధి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా అసలు విషయం బయటపడింది. ఆ వీడియో లో క్లియర్ గా కనపడుతుంది మద్యం సీసాలను పెట్టారు అని. ఆ సీసాలను పెట్టిన తర్వాత పోలీసులు ఇంటికి రావడం సరిగా నీళ్ళ ట్యాంక్ లో మద్యం సీసాలను ఉంచారని అనడం వంటివి మరిన్ని అనుమానాలకు వేదికగా మారాయి. ఆ వీడియో కచ్చితంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసారు అనే విధంగానే ఉంది.
కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలను లాక్కోవడం కూడా వైసీపీని ఇబ్బంది పెట్టిన పరిణామం. ఒక మహిళ జాకెట్ లో ఉన్న నామినేషన్ పత్రాలను దౌర్జన్యం చేసి లాక్కునే ప్రయత్నం చేసారు. అలాగే కొన్ని చోట్ల దాడులకు దిగారు. ఆ వీడియో లు కూడా అనవసరం గా వైసీపీని ఇబ్బందులు పెట్టాయి. ఈ విధంగా వైసీపీ నేతలు అనవసరంగా ఇరుక్కుపోయారు అనే అభిప్రాయం ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.