మహానాడు వేడుకకు సిద్ధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు కు ఒక గిఫ్ట్ రెడీ చేసిందట వైకాపా! ప్రస్తుతం ఏపీలో.. పర్టిక్యులర్ గా దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాల్లో ఈ టాపిక్ హడావిడి మామూలుగా లేదు! ఇంతకూ ఆ గిఫ్ట్ ఏమిటంటే… టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపా తీర్ధం పుచ్చుకోనున్నారట! ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దూరమయ్యి.. ఆ డ్యామేజీని ఎలా కవర్ చేసుకోవాలా అని టీడీపీ అధినేత తలపట్టుకున్న ఈ సమయంలో… సరిగ్గా అదను చూసి అన్నట్లుగా మహానాడు వేడుకల సమయంలో ఈ దెబ్బ కొట్టాలని వైకాపా ప్లాన్ చేస్తుందట!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, గోదావరి జిల్లాలకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే “ఫ్యాన్” గాలి కింద సేద తీరాలని ఫిక్సయ్యారని… ఈ సమయంలో వైకాపా కీలక నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది! అదే నిజమైతే… “జగన్ అభివృద్ధిని చూసి.. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకే వైకాపా తీర్ధం పుచ్చుకున్నట్లుగా”.. ఈ నాయకులు చెప్పబోతున్నారనేది తెలిసిన విషయమే! గతంలో వైకాపా నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్న అనంతరం బాబు… వారితో చెప్పించిన మాటలు ఇవే కదా! అయితే… రాజీనామాలు చేసిన తర్వాతే అధికారికంగా వైకాపా నేతలుగా గుర్తిస్తామనే జగన్ సిద్ధాంతం ప్రకారం… ప్రస్తుతానికి వారు టీడీపీకి రాజినామా చేసే ఆలోచనవైపు వైకాపా అడుగులు వేస్తోందని మరో వాదన!
ఈ క్రమంలో జరుగుతున్న రాయబారాలు, నడుస్తున్న ప్రచారాల నేపథ్యంలో.. ఇదే నిజమైతే అసెంబ్లీలో ఇక టీడీపీ నెంబరు 18 – 19 మధ్య ఊగిసలాడొచ్చని అంచనా! నాడు వైకాపా నుంచి 23 మంది పోయినా పెద్దగా పార్టీపై ప్రభావం కనిపించినట్లు లేదు కానీ… ప్రస్తుతం ఉన్న టీడీపీ నుంచి ఇద్దరు పార్టీని వీడినా అది బాబుకు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! కాగా… అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైకాపా నేతలకు కండువాలు కప్పి, వారితో రాజినామాలు చేయించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ.. వారికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన చంద్రబాబుకు ఇది సరైన గుణపాఠమే అని కొందరు అభిప్రాయపడటం కొసమెరుపు!