వైఎస్ జగన్ అధ్యక్షుడుగా ఉన్న వైసీపీ దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. ఏ విషయంలో అంటారా.. పార్టీ నిధుల విషయంలో.. ఏడీఆర్ అనే సంస్థ.. దేశంలోని ప్రాంతీయ పార్టీల నిధులకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. దీని ప్రకారం వైసీపీ గత ఏడాది కంటే.. దాదాపు 225 శాతం పెరుగుదల తన నిధుల్లో కనిపించింది.
తాజాగా ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న 43 ప్రాంతీయ పార్టీలకు 2017-18 నాటికి రూ.1,320 కోట్ల ఆస్తులున్నాయట. ఇందులో అన్ని పార్టీల కంటే వైసీపీ ఆదాయం పెరుగుదల రికార్డు స్థాయిలో ఉందని తేలింది. 2016-17 నుంచి 2017-18 మధ్యకాలంలో టీడీపీ ఆస్తి 15.4% మేర వృద్ధి చెందింది. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆస్తి 100 శాతం పెరిగింది. అంటే డబుల్ అయ్యింది.
ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 225 శాతం పెరిగిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఆ విధంగా దేశంలో అత్యధిక ఆస్తి వృద్ధి రేటు నమోదు చేసిన పార్టీల్లో వైసీపీ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇక మిగిలిన పార్టీల విషయం చూస్తే.. మొత్తం 12 పార్టీల ఆస్తులు గతంతో పోలిస్తే తగ్గాయట. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలపరంగా చూస్తే.. తెలుగుదేశం ఆస్తి విషయంలో నాలుగో స్థానం, అప్పుల విషయంలో మొదటి స్థానంలో నిలిచిందట.
మిగిలిన పార్టీల ఆస్తులు ఏంతో కొంత పెరిగాయట. దేశం లోని అన్ని ప్రాంతీయ పార్టీలకు రూ. 61.61 కోట్ల అప్పున్నాయి. అందులో తెలుగు దేశం పార్టీకి 36 శాతం ఉన్నాయి. ఇక తర్వాత స్థానాల్లో డీఎంకె, జేడీఎస్, వైసీపీ ఉన్నాయట. ఇక టీఆర్ఎస్ కు 2017-18లో కేవలం
36 లక్షలు మాత్రమే అప్పు ఉందట.
కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం 2017-18 నాటికి తెలుగుదేశం ఆస్తులు రూ.131.50 కోట్లు. అంతకు ముందు సంవత్సరం చూపిన రూ. 114. 05తో పోలిస్తే టీడీపీ ఆస్తిలో 15శాతం వృద్ధి నమోదైంది.