ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ముఖ్యంగా పథకాల నిర్వహణను తెలుసుకునేందుకు యువ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పిలుపు మేరకు, మార్గనిర్దేశకత్వం మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన సంగతి తెలిసిందే ! ముఖ్యంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగర ప్రాంతాల్లో కానీ ఇంటింటికీ తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి.. గెలిచిన ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చొంటే సమస్యలు తెలియవు అన్న ప్రధానోద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సీఎం డిజైన్ చేశారు. మొదట్లో గడపగడపకూ పోయేందుకు ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో పలు సార్లు ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. కానీ అసని తుఫాను తరువాత ఈ కార్యక్రమం ముందు నిర్ణయించుకున్న ప్రకారమే ప్రారంభించక తప్పలేదు.
తుఫాను తరువాత కార్యక్రమం కావడంతో ఉత్తరాంధ్ర నాయకులు హడలిపోయారు.అయినా కూడా జగన్ మాత్రం కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలూ, ఎంపీలూ జనం మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలన్నారు. ఇంటింటికీ సర్వే చేయనిదే ఒప్పుకునేది లేదని తేల్చేశారు. దీంతో జగన్ చెప్పిన విధానం ప్రకారమే కొందరు అయిష్టంగానే ఇందుకు సమ్మతించారు. చాలా చోట్ల వివాదాలు రేగాయి. అవమానాలు ఎదురయ్యాయి. అయినా కూడా కార్యక్రమం ఆపేందుకు వీల్లేదని తేలిపోయింది.
కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నోరేసుకు పడిపోయినా కూడా అవేవీ పట్టించుకోకుండా ప్రజలు తాము చెప్పదల్చుకున్న దేదో చెప్పారు. నర్సీపట్నం గణేశ్ బూతులు తిట్టినా, అనకాలపల్లి శ్రీను అసహనం తో ఊగిపోయినా, బొబ్బిలి అప్పల నాయుడు..పింఛను రాలేదా నీ కర్మ అని చెప్పి వెళ్లినా ఇవన్నీ మీడియాలో రికార్డు కావడంతో సంబంధిత వర్గాలు అప్రమత్తం అయ్యేందుకు ఓ అవకాశం దక్కింది. పబ్లిక్లో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అన్నవి మరోసారి ప్రజాప్రతినిధులకు తెలిసివచ్చాయి.
పాలనలో ! బాగుంది ఇంకాస్త రావాలి ! వస్తుంది కూడా !