స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు.. అందరూ సమానమే అన్నారు. విపక్ష నేత చంద్రబాబు ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడని, 2014లో ఓటుకు నోటు కేసును కూడా అలాగే మేనేజ్ చేశాడని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు రిమాండ్ విధించిందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలోనే కాకుండా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ లోనూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో భారీగా అవినీతి జరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ రోజు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.