ఉత్తరాంధ్రలో వైవీ ఎఫెక్ట్..వైసీపీకి ఎదురుదెబ్బేనా.?

-

టీడీపీ బలంగా ఉండే ఉత్తరాంధ్రలో వైసీపీకి గత ఎన్నికల్లో భారీ విజయం సాధించడంలో జగన్ గాలితో పాటు…విజయసాయిరెడ్డి కష్టం కూడా ఉందని చెప్పవచ్చు. 2014లో వైసీపీ ఓడిన దగ్గర నుంచి సాయిరెడ్డి విశాఖ కేంద్రంగా వైసీపీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. 2019లో మంచి విజయం అందుకునేలా చేశారు. కానీ నిదానంగా సాయిరెడ్డిని సైడ్ చేశారు.

ఇక ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డిని పెట్టారు. సుబ్బారెడ్డి వచ్చాక వైసీపీకి పెద్దగా కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో టి‌డి‌పి బలపడుతూనే ఉంది. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వైసీపీ ఓడిపోయింది. ఇలా ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఉత్తరాంధ్రపై వైవీ పెత్తనం మరింత పెరిగిందని, దీని వల్ల పార్టీకే నష్టం జరుగుతుందని అక్కడ వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైవీ..రెండు సీట్లలో అభ్యర్ధులని ప్రకటించడం మరింత చిచ్చు రాజేసింది.

తాజాగా పెందుర్తి సీటులో ఎమ్మెల్యే అదీప్ రాజ్ మళ్ళీ పోటీ చేస్తారని వైవీ ప్రకటించారు. అటు ఎలమంచిలి సీటులో ఎమ్మెల్యే కన్నబాబు రాజు  సైతం మళ్ళీ పోటీ చేస్తారని చెప్పారు. దీంతో వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఎందుకంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. దీంతో జగన్..వారికి సీట్లు ఇవ్వరని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్..పెందుర్తి నుంచి బరిలో దిగాలని చూశారు. కానీ వైవీ ప్రకటనతో పంచకర్ల వైసీపీకే వీడ్కోలు చెప్పారు.

గతంలో పంచకర్ల ప్రజారాజ్యం నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014లో టి‌డి‌పిలోకి వచ్చి..ఎలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచే ఎలమంచిలిలో తక్కువ మెజారిటీతో ఓడిపోయి, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన వైసీపీకే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ టి‌డి‌పి వైపే చూస్తున్నారని తెలిసింది. మొత్తానికి పంచకర్ల లాంటి బలమైన నేత వైసీపీని వీడటం..ఆ పార్టీకే పెద్ద డ్యామేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version