జాంబీ రెడ్డి టీజర్: ఒళ్ళు గగుర్పొడిచే భయంకర దృశ్యాలతో..

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జాంబీ రెడ్డి చిత్రం టీజర్ ఈ రోజే విడుదలైంది. తెలుగులో మొదటి జాంబీ ఫిలిమ్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆద్యంతం భయపెట్టేదిగా ఉండనున్నట్టు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం, రాక్షసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం.. అన్న మాటలు మనుషుల రూపాల్లో ఉండే రాక్షసుల గురించి చూపిస్తుంది.

ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు మనుషులకి మేధాశక్తిని ఇచ్చి తప్పుచేసాడని, దానివల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని, బ్యాగ్రౌండ్ లో కరోనా గురించి కరోనా వ్యాక్సిన్ గురించి చూపించడం ఆసక్తిగా ఉంది. కరోనా కేవలం మొదలు మాత్రమే ఇంకా ముందు ముందు చాలా ఉందని చెబుతున్నట్లుగా సినిమా టీజర్ కనిపించింది. తేజ సజ్జా హీరోగా ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్లో రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు.