జలవిళయంలో కొట్టుమిట్టాడుతున్న కేరళకు యూఏఈ భారీ సహాయం ప్రకటించింది. ప్రకృతి కోపానికి బలై కట్టుబట్టలతో మిగిలిన కేరళ పునర్నిర్మాణానికి దాదాపు 700 కోట్ల రూపాయల భూరి విరాళాన్ని అందజేయనున్నట్లు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ సయ్యద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు తిరువనంతపురంలో విలేకరులకు చెప్పారు.
ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ సయ్యద్ అల్ నహ్యాన్, యువరాజు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్థూంలకు విజయన్ కృతజ్ఞతలు తెలియజేసారు. అంతకుముందు గల్ఫ్‌లో స్థిరపడ్డ పారిశ్రామికవేత్త యూసుఫ్ అలీ, కేరళ దయనీయ స్థితిని యూఏఈ యువరాజుకు వివరించగా ఆయన ఈ దాతృత్వానికి సిద్ధపడ్డారు.
‘గల్ఫ్ దేశాలకు, కేరళకు ఒక ఉద్వేగపూరిత బంధం ఉంది. ఒకరకంగా మళయాళీలకు గల్ఫ్ రెండో ఇంటి కింద లెక్క ‘ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.