మీ సోదరుడి రాశి ప్రకారం.. ఏ రంగు రాఖీ కట్టాలో మీకు తెలుసా?

-

రాఖీ పౌర్ణమి.. సోదరీసోదరుల అవిభాజ్యమైన ప్రేమకు గుర్తు. అన్నాచెల్లెళ్లు, అక్కా,తమ్ముళ్ల మధ్యనున్న ప్రేమను చాటి చెప్పేందుకు చేసుకునే పవిత్రమైన పండగ. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ.. తన రక్షణను కాంక్షిస్తూ ప్రతి సోదరి అన్న లేదా తమ్ముడికి రాఖీ కడుతారు.
అయితే జ్యోతిషయం ప్రకారం ఆయా రాశులకు సంబంధించి మీ సోదరుడి రాశి ప్రకారం కొన్ని రకాల రంగుల్లో ఉన్న రాఖీని.. తన చేతికి కడితే తనకు అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిషుల సూచనలు తెలుసుకుందాం…

రాశుల వారీగా రాఖీ రంగులు

మేషం (Aries)
ఈ రాశికి అధిపతి కుజుడు. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశికి చెందినవారైతే వారికి ఎరుపు లేదా పసుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టండి. ఇది వారికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఆ శక్తి వారి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించి వారు అన్నింటా ముందుకెళ్లేలా చూస్తుంది. కేవలం రాఖీ కట్టడమే కాదు.. ఈ పండగ సందర్భంగా మీ సోదరుడికి ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉన్న దుస్తులు లేదా బహుమతులు అందిస్తే ఇంకా బాగుంటుంది.

వృషభం (Tarus)
ఈ రాశికి అధిదేవత శుక్రుడు. అందుకే.. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారైతే వారికి నీలం, బూడిద రంగులో ఉన్న రాఖీలను కట్టండి. మీకు వీలుంటే వెండి రాఖీని కొని కట్టడం ఇంకా మంచిది. ఇది మీ సోదరుడి జీవితాన్ని మార్చేస్తుంది.

మిథునం (Gemini)
మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో పుట్టినవారి కోసం ఆకుపచ్చ, ఎరుపు, గంధం రంగులో ఉండే రాఖీలను ఎంచుకోవడం వల్ల మీ సోదరుడికి ఎప్పుడూ సుఖశాంతులు కలుగుతాయట.

కర్కాటకం (Cancer)
ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి గుర్తుగా తెల్లని ముత్యాలతో కూడిన రాఖీని లేదా వెండితో తయారుచేసిన రాఖీని కట్టడం వల్ల మీ సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడట. కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు.. తెలుపు లేదా క్రీం రంగులో ఉన్న దుస్తులు లేదా బహుమతులు కూడా అందించడం వల్ల కేవలం అప్పుడే కాదు.. సంవత్సరం మొత్తం మీ సోదరుడు ఆనందంగా ఉంటారట.

సింహం (Leo)
సింహ రాశికి అధి దేవత సూర్యుడు. అందుకే సూర్యుడిని తలపించేలా వీరి రాఖీ రంగు కూడా ఎరుపు లేదా గులాబీ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. ఈ రోజు మీ సోదరుడు ఇష్టపడే బహుమతులు ఏవైనా.. ఈ రంగుల్లో ఉండేలా చూసుకొని వారికి అందిస్తే మీ బంధం జీవితాంతం అంతే బలంగా ఉంటుందట.

కన్య (Virgo)
కన్యా రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశి వారికి ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న రాఖీ తీసుకొచ్చి కట్టాలట. అంతేకాదు.. ముత్యంతో చేసినవి.. గంధం రంగులో ఉండేవి కూడా తీసుకోవచ్చు. ఆకుపచ్చ రంగు బహుమతులు మీ సోదరుడు ఆనందంగా ఉండేలా చేస్తాయట.

తుల (Libra)
తుల రాశి అధిపతి శుక్రుడు. మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారు అయితే తనకి నీలం, టర్కోయిస్, పర్పుల్ రంగుల్లో ఉండే మంచి రాఖీలను వెతికి అందించడంతో పాటు.. తెలుపు, బూడిద వర్ణాల్లో ఉండే ఏదైనా బహుమతిని కూడా ఇవ్వడం వల్ల వారు సంవత్సరమంతా ఆనందంగా ఉంటారట.

వృశ్చికం (Scorpio)
ఈ రాశి అధిదేవత కుజుడు. అందుకే మీ సోదరుడు ఈ రాశి వారైతే.. వారికి ఎరుపు రంగులో ఉన్న రాఖీ కట్టండి. లేదా ముత్యంతో కూడినది కట్టినా బాగుంటుంది. అంతేకాదు.. ఈ పండగ రోజు వారికి ఇచ్చే బహుమతి తెలుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఇది మీ సోదరుడి జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుందట.

ధనుస్సు (Saggitarius)
ఈ రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశివారికి పసుపు, గంధం రంగుల్లో ఉండే రాఖీ కట్టడం వల్ల వారు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారట. అయితే వీరికి బహుమతులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎరుపు రంగువి ఇవ్వండి. దీనివల్ల వారి కెరీర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది.

మకరం (Capricorn)
మకర రాశి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టడం వారి శ్రేయస్సుకు ఎంతో మంచిది. అంతేకాదు.. ఆ శని దేవుడిని మీ అన్న లేదా తమ్ముడిపై ఎప్పుడూ వరాల వర్షం కురిపించాలని కోరుకుంటూ పూజ చేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి.

కుంభం (Aquarius)
ఈ రాశికి అధిపతి శని. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ అన్న లేదా తమ్ముడికి నీలం రంగు రాఖీని కట్టండి. ఇది వారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది.

మీనం (Pisces)
మీన రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ సోదరుడు ఆనందంగా ఉండేలా అతడికి పసుపు రంగు రాఖీ కట్టండి. అంతేకాదు.. తెలుపు రంగులో ఉన్న దుస్తులు లేదా ఇతర బహుమతులు అతడికి ఇవ్వడం వల్ల వారి కష్టాలన్నీ తొలగిపోతాయట.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news