అంతరిక్షంలో హోటల్ ఇక ఎంతో దూరంలో లేదు.. ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా వచ్చేసింది..

-

అంతరిక్షం మీద మానవుడి పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి. అంతరిక్షం మీద చేస్తున్న పరిశోధనలని చూస్తుంటే మనబోటి సామాన్యుడు కూడా అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం ఎంతో దూరంలో లేదని తెలుస్తుంది. అవును, అంతరిక్షంలో హోటల్ నిర్మాణం జరుగుతుంటే ఇదంతా నిజం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పోరేషన్ అనే సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే ఈ హోటల్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్లో విడుదల అయ్యాయి. 400మందికి సేవలందించే ఈ హోటల్ కి వొయేజర్ స్టేషన్ అని నామకరణం చేసారు. కృత్రిమంగా గురుత్వాకర్షణని సృష్టించి అంతరిక్షంలోకి వెళ్ళే ఎంతో మందికి వసతి ఏర్పాటు చేయనుంది. నేషనల్ స్పేస్ ఏజెన్సీ ద్వారా వచ్చే అంతరిక్ష ప్రయాణీకులకు, సరికొత్త అనుభూతిని అనుభవించాలని చూసే ఉత్సాహవంతులని ఈ హోటల్ కి ఆహ్వానిస్తుంది. జెయింట్ వీల్ ఆకారంలో ఉండే ఈ హోటల్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఐతే ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి 25మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయట. ఇక్కడకి వచ్చే వారు స్పేస్ సూట్స్ వేసుకునే ఉండాల్సిన పనిలేదు. కృత్రిమ గురుత్వాకర్షణ వల్ల భూమి మీద ఎలా అయితే ఉండగలుగుతున్నామో, టాయిలెట్ కి వెళ్ళడం, స్నానం చేయడం వంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

2018లో ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పోరేషన్ ఇలాంటి అంతరిక్ష హోటల్ ని ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తుంది. కృత్రిమ గురుత్వాకర్షణని సృష్టించడమే పెద్ద ఇబ్బందిగా ఉందట. ఇక్కడ నుండి పెట్టుబడిదారులని ఆకర్షించి హోటల్ పూర్తయ్యాక రిజర్వేషన్ సౌలభ్యాన్ని ఇవ్వనుందట. మరింకేం మీకెవరికైనా అంతరిక్షంలోకి వెళ్లాలని ఉంటే అప్లై చేసుకోండి. 2027నాటికి ఈ హోటల్ పూర్తయ్యే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news