భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్‌మోర్.. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వారు అక్కడి నుంచి వారంలోగా తిరిగి రావాల్సి ఉండగా.. యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. తాజాగా వారి తిరుగు ప్రయాణంపై నాసా ఓ ప్రకటన చేసింది. స్పేస్ సెంటర్ నుంచి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారాంతంలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు శనివారం రోజున సమావేశం కానున్నారు.
ఇక వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించడంతో వీరు వెళ్లిన నౌకలో తిరుగు ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేలితే అది ఖాళీగానే సెప్టెంబర్‌లో భూమి దిశగా ప్రయాణం సాగిస్తుంది. ఇక వ్యోమగాములను భూమిపైకి తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రత్యేకంగా స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌ను పంపాల్సి ఉంటుంది. అయితే, అందుకోసం ఫిబ్రవరి వరకు వేచి చూాడాల్సిందేనని ఇటీవలే నాసా ప్రకటించింది.