వావ్.. ఆ కారు గాలితో న‌డుస్తుంద‌ట‌.. వండ‌ర్‌ఫుల్ క‌దా..!

-

మ‌న దేశంలో రోజు రోజుకీ వాహ‌నాల ఇంధ‌న ధ‌ర‌లు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. రోజు రోజుకీ ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయే త‌ప్ప అవి ఎంత‌కీ దిగి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నాల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు సైంటిస్టులు ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నాల‌పై ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం కొంద‌రు విద్యార్థులు కేవ‌లం గాలితో న‌డిచే కారును ఆవిష్క‌రించారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ కారు న‌డ‌వాలంటే.. కేవ‌లం గాలి ఉంటే చాలు.. మ‌రి ఆ కారు విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఈజిప్ట్‌లోని హెల్వ‌న్ విశ్వ విద్యాల‌యం అది. ఆ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ విద్యార్థి బృందం గాలితో న‌డిచే కారును రూపొందించింది. ఈ కారును వారు త‌మ గ్రాడ్యుయేష‌న్ ప్రాజెక్టులో భాగంగా త‌యారు చేశారు. ఈ కారు త‌యారీకి వారికైంది 18వేల ఈజిప్ట్ పౌండ్లు (సుమారుగా 1008 డాల‌ర్లు). ఇక ఈ కారు గో కార్టింగ్ రేసులో ఉప‌యోగించే కారును పోలి ఉంటుంది. ఇందులో కేవ‌లం ఒక‌రు మాత్ర‌మే ప్ర‌యాణించ‌గ‌ల‌రు. ప్రోటోటైప్ వెర్ష‌న్ క‌నుక ఒక్క‌రికే ప్ర‌యాణానికి సాధ్య‌మ‌వుతుంది.

ఈ కారు కేవ‌లం గాలితోనే న‌డుస్తుంది క‌నుక దీంతో కాలుష్యం ఏమాత్రం రాదు. దీని గ‌రిష్ట వేగం గంట‌కు 40 కిలోమీట‌ర్లు. కంప్రెస్డ్ ఆక్సిజ‌న్ అనే ఇంధ‌నం స‌హాయంతో ఈ కారు న‌డుస్తుంది. ఒక‌సారి ఇంధ‌నం నింపాక కారు 30 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. గాలిని కంప్రెస్ చేసి ఇంధ‌నంగా మార్చి ఈ కారులో ఉప‌యోగిస్తారు. అందువ‌ల్ల కారు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు అస‌లే ఉండ‌ద‌ని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ఇక కారు వేగాన్ని త్వ‌ర‌లోనే గంట‌కు 100 కిలోమీట‌ర్ల వ‌ర‌కు పెంచుతామ‌ని, గాలిని ఒక‌సారి నింపుకుంటే క‌నీసం 100 కిలోమీట‌ర్ల వ‌ర‌కు నిరాటంకంగా ప్ర‌యాణించేలా కారును మ‌రింత అధునాత‌నంగా తీర్చిదిద్దుతామ‌ని స‌ద‌రు విద్యార్థులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కార్లు అందుబాటులోకి వ‌స్తే అప్పుడు ఇంధ‌నం కోసం వేల రూపాయ‌లు త‌గ‌లేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌దా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version