చంద్రయాన్‌లో విక్రమ్ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే!!

277

చంద్రయాన్-2 అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు కానీ చివరి అంకంలో చిన్న అపశృతి. ఈ ప్రయోగంలో రెండు కీలకమైనవి ఒకటి ఆర్బిటార్, రెండోది చంద్రుడి దక్షిణ దృవం మీద ల్యాండై పరీక్షలు నిర్వహించాల్సిన విక్రమ్‌లోని ప్రజ్ఞ. కానీ చంద్రుడికి అత్యంత సమీపంలో విక్రం ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం అందరికీ విదితమే. అయితే దీనికోసం ఇస్రో పలు దేశాల సహాయంతో శ్రమించినా ఇప్పటివరకు ఫలితం సాధించలేకపోయింది.

ఆర్బిటార్ మాత్రం చక్కగా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ తన పనితాను చేస్తుంది. ల్యాండర్ విక్రమ్‌పై శాస్త్రవేత్తలు పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. విక్రమ్‌లోని ఆటోమెటిక్ ల్యాండింగ్ ప్రోగ్రామ్(ఏఎల్‌పీ) విఫలం కావడంతో బ్రేక్‌లుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు యాక్సెలరేటర్లుగా పనిచేసి ఒక్కసారిగా వేగాన్ని పెంచి ఉండొచ్చని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఇందువల్లే గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ఢీకొని ఉండవచ్చని ఓ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

విక్రంపై నాసా చిత్రాలు

విక్రం జాడ కోసం ఇస్రో నాసాను సంప్రదించగా… నాసాకు చెందిన రోబోటిక్ అంతరిక్ష వాహనం లూన్ రీకనైజాన్స్ ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌వో) విక్రం జాడకు సంబంధించి పలు చిత్రాలను శుక్రవారం విడుదల చేసింది. అయితే ఆ చిత్రాల్లో చం ద్రుడి ఉపరితలం చీకటిగా కనిపిస్తుండటంతో ల్యాండర్ నిర్దిష్ట ల్యాండింగ్ ప్రదేశాన్ని కనుక్కోవడం కష్టంగా మారింది. నేటితో విక్రం (సెప్టెంబర్ 21) జీవితకాలం ముగియనుంది. దీంతోపాటు రేపటి అంటే సెప్టెంబర్ 22 నుంచి చంద్రుడిపై రాత్రికాలం ప్రారంభం కానున్నది. దీంతో విక్రం జాడ మరో కిష్టతరంగా మారనున్నది. చంద్రుడిపై రాత్రి పదిహేను రోజుల తర్వాత ముగుస్తుంది. కానీ ఆ తర్వాత ఎంతమేరకు మంచుకప్పుకొని ఉంటుంది అనేదానిపై విక్రం జాడ ఆధారపడి ఉంటుంది.

– కేశవ