సాఫ్ట్వేర్ సంస్థ యాపిల్ అక్టోబర్ 2020లో ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు కొత్త మోడల్స్ ను విడుదల చేసిన విషయం విదితమే. ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. అయితే ఐఫోన్ 12 ఫోన్లను మాత్రం యాపిల్ భారత్‌లోనే ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 7, ఎక్స్ఆర్, ఐఫోన్ 11లను మాత్రమే యాపిల్ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో యాపిల్ ఇకపై ఐఫోన్ 12 ను కూడా భారత్‌లో ఉత్పత్తి చేయనుంది.
అయితే ఐఫోన్ 12కు చెందిన 64జీబీ మోడల్ ధర రూ.79,900గా ఉంది. ట్యాక్స్‌లు కలిపితే ఆ ధర అవుతుంది. కానీ ఈ ఫోన్ ఇకపై మన దగ్గరే ఉత్పత్తి కానుండడంతో దీని ధర భారీగా తగ్గనుంది. సుమారుగా రూ.13,900 మేర ఈ ఫోన్ ధర తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ రూ.66వేలకు లభిస్తుందని సమాచారం. అయితే దీనిపై త్వరలో వివరాలు తెలుస్తాయి.
కాగా చెన్నైలోని ఫాక్స్‌కాన్ కంపెనీ పరిశ్రమలో ఇప్పటికే పలు ఐఫోన్లు ఉత్పత్తి అవుతుండగా ఇకపై ఆ పరిశ్రమలోనే ఐఫోన్ 12ను ఉత్పత్తి చేయనున్నారు. అయితే ఐఫోన్ 12 ఫోన్లను ఆ పరిశ్రమలో ఉత్పత్తి చేసినా వాటిని కేవలం భారత్‌లోనే విక్రయిస్తారు. విదేశాల్లో విక్రయించరు. ఇక ఐఫోన్ 12 భారత్‌లో ఉత్పత్తి కానుండడం ఐఫోన్ ప్రియులకు శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే కచ్చితంగా ధర తగ్గుతుంది కనుక.. ప్రస్తుతం ఉన్న దాని కన్నా ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్ లభిస్తుంది.