నూతన ప్రైవసీ పాలసీని అమలు చేయడం ఏమోగానీ వాట్సాప్‌కు విపరీతమైన కష్టాలు వచ్చి పడ్డాయి. వాట్సాప్ చేసిన పని వల్ల పెద్ద ఎత్తున యూజర్లు ఆ యాప్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అనేక మంది టెలిగ్రాం, సిగ్నల్ వంటి యాప్‌లను ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే రెండు సంస్థలు ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం.. భారత యూజర్లు వాట్సాప్‌ను నమ్మడం లేదని వెల్లడైంది.
సైబర్ మీడియా రీసెర్చ్ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం.. దేశంలోని మొత్తం వాట్సాప్ యూజర్లలో 79 శాతం మంది వాట్సాప్‌ను నమ్మడం లేదని వెల్లడైంది. అంటే.. వారు వాట్సాప్ కాకుండా త్వరలో ఇతర ఇన్స్టంట్ యాప్‌లకు మారే ఆలోచనలో ఉన్నారన్నమాట. ఇక కేవలం 10 శాతం మంది మాత్రమే తమకు వాట్సాప్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అలాగే 76 శాతం మందికి వాట్సాప్‌లో వచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ గురించి తెలుసని చెప్పారు.
ఇక లోకల్ సర్కిల్స్ అనే మరో సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం.. మొత్తం వాట్సాప్ యూజర్లలో 75 శాతం మంది వాట్సాప్‌ను వాడడం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని వెల్లడైంది. కేవలం 5 శాతం మంది మాత్రమే తమకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే వాట్సాప్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్న వారు, దాన్ని నమ్మలేం అంటున్నవారు రానున్న రోజుల్లో ఇతర ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లకు మారుతారా, లేదా.. అన్న వివరాలు త్వరలో తెలుస్తాయి.