మోటొరొలా రేజర్‌ కొత్త అవతారం

మోటొరొలా రేజర్‌… మొబైల్ ప్రపంచంలో ఒక ఊపు ఊపిన ఫ్లిప్‌ ఫోన్‌. 2004 నుండి 2007 వరకు సెల్యులార్‌ సామ్రాజ్యాన్ని ఏలిన ఈ ఫోన్‌ ఇన్నాళ్లకు కొత్త అవతారమెత్తి తిరిగి రంగప్రవేశం చేసింది.

మోటొరొలా రేజర్‌-2019 వచ్చేసింది. ఒకప్పటి మొబైల్‌ రారాజు రేజర్‌, విప్లవాత్మకమైన మడవగలిగే తెరతోపునఃప్రవేశం చేసింది. నిన్న లాస్‌ ఏంజిలస్‌లో ఒక ప్రత్యేక ఈవెంట్‌ ఏర్పాటు చేసి, తయారీసంస్థ, లెనోవో సరికొత్త రేజర్‌ను ప్రజలకు పరిచయం చేసింది.

ప్రాథమిక తెర 6.2 అంగుళాల పరిమాణంలో సగానికి సగం మడవగలిగే విధంగా ఉంది. ఓలెడ్‌ హెచ్‌డి+ నాణ్యతతో ఉన్న ఈ తెర మధ్యలో ఎక్కడా సందు లేకుండా పూర్తిగా మడతపెట్టేయొచ్చు. మూసేసిన తర్వాత పైన ఇంకో 2.7 ఇంచుల తెర ఉంది. నోటిఫికేషన్లు, సెల్ఫీలు, సంగీతం కోసం ఈ స్క్రీన్‌ను వాడవచ్చు. ‘‘విప్లవాత్మకమైన ఈ మడతపెట్టే సాంకేతికతో మోటొరొలా చరిత్ర సృష్టించింది. ఫోల్డ్‌ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెర సగానికి సగం మడతపెట్టబడుతుంది. దీనివల్ల తెరకు పూర్తి రక్షణ ఏర్పడటంతో పాటు ఫోన్‌ ఇంకా సన్నగా తయారుకావడానికి సహాయపడింది’’ అని మోటొరొలా ఒక ప్రకటనలో తెలిపింది.

16 ఎంపి ప్రాథమిక కెమెరా, మడత పెట్టినప్పుడు సెల్ఫీ కెమెరాగా, తెరిచినప్పుడు మెయిన్‌ కెమెరాగా పనిచేస్తుంది. ఇది కాక, తెరిచిఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకోవడానికి ఇంకో 5ఎంపి కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ పైతో పనిచేసే ఈ ఫోన్‌లో మనం ఏం చూస్తున్నా, తెరిచినప్పుడు, మూసినప్పుడు పై తెరపై, లోపలి పెద్ద తెరపై అదే కనిపిస్తుంది.

ఇప్పుడున్న పెద్ద మొబైళ్లలో ఉన్న అన్ని సౌలభ్యాలు, హార్డ్‌వేర్‌ ఇందులో ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, యుఎస్‌బి-సి పోర్ట్‌, 6జిబి ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్‌, 2510 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సి, 4జిఎల్‌టీఈ, వైఫై 802.11ఎసి లాంటి టాప్ స్పెక్స్‌ ఉన్నాయి. కాకపోతే ఒక విచిత్రమేమిటంటే, ఇందులో డ్యూయల్‌ సిమ్‌ సౌలభ్యం ఉన్నా, ఫిజికల్‌ సిమ్‌కార్డ్‌ వాడలేము. సిమ్‌కార్డ్‌ స్లాట్‌ లేదు దీన్లో. రెండూ ఈ-సిమ్‌లే వాడాల్సివుంటుంది.

వచ్చే సంవత్సరం జనవరి 9 నుండి అమెరికాలో అమ్మకాలు ప్రారంభం కానున్న రేజర్‌, భారత్‌కు కూడా వస్తుంది కానీ, తేదీని ఇంకా ప్రకటించలేదు. ధర అమెరికాలో 1500 డాలర్లు ( దాదాపు 1,07,400 రూపాయలు) గా నిర్ణయించారు.