ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు(గురువారం) విజయవాడ వేదికగా ఇసుక దీక్షకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన ఈ దీక్ష చేయనున్నారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో సుదీర్ఘ చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పరిస్తితులు తెలిసిన అనుభశీలిగా.. పాలనానుభవం ఉన్న నాయకుడిగా ఆయన ఈ దీక్ష చేయడాన్ని మెజారిటీ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇసుక కేంద్రంగా సాగుతున్న విపక్షాల పోరులో బాబు చేస్తున్న దీక్ష పరాకాష్ట! ఇప్పటికే జనసేన అధినేత పవన్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేశారు.
ఇక, బీజేపీ కూడా ఇప్పటికే ఇసుక ఉద్యమం పేరుతో విజయవాడలో ధర్నా చేసింది. వీటితో సమాంతరంగా చంద్రబాబు కూడా తన తమ్ముళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయించారు. అవిచాలవన్నట్టు ఆయన ఇప్పుడు 12 గంటల దీక్షకు పూనుకున్నారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నిన్న మొన్నటి వరకు పార్టీలోనే వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కనిపిస్తుండడం గమనా ర్హం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ప్రతిపక్షంగా స్పందించాల్సిన బాధ్యత, అవసరం రెండూ ఉంటాయి.
అయితే, రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాలు కూడా కాకముందుగానే ఇసుక సమస్య తెరమీదికి వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. భారీ ఎత్తున వచ్చిన వరదలు, వర్షాల కారణంగా నదుల్లో ఇసుక లభ్యతకు కొరత ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయలేక పోయింది. ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన వారం రోజులుగా కూడా ఇసుక లభ్యత కొనసాగుతోంది. మరో వారం ఆగితే.. పరిస్థితి చక్కబడుతుంది. కావల్సినంత ఇసుక లభిస్తుంది. అయితే, ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా రాజకీయంగా చేస్తున్నారనే వాదన ప్రబలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
రాజకీయంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో బాబు ఎత్తుకున్న అజెండాగా సోషల్ మీడియాలో జనాలు దీనిని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే పవన్ చేపట్టి లాంగ్ మార్చ్‌కు మంచి స్పందన వచ్చింది. అది సరైన టైంలో సరైన విధంగా సాగింది కాబట్టి దీనికి అంత ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు పవన్‌కు వచ్చిన పేరును తానే కొట్టేయాలనే ఉద్దేశంతో బాబు చేపడుతున్న దీక్షగా ప్రజలు పేర్కొంటున్న విషయాన్ని బాబు గుర్తించాలని అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. మరి బాబు ఏమంటారో చూడాలి.