కొత్త ఫీచర్లతో ఓటర్ ఐడీ.. కార్డుల రూపు రేఖలు మారుతున్నాయ్..!

-

గతంలో ఓటర్ ఐడీ కార్డులు బ్లాక్ అండ్ వైట్‌లో , తరువాత కలర్‌లో ఇక ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీ కార్డుల స్థానంలో నూతనంగా స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులు..

ప్రస్తుతం చాలా మంది ఐడీ, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఓటర్ ఐడీ కార్డు (ఎపిక్ కార్డు)ను ఆయా పనులకు బాగా ఉపయోగించేవారు. ఇక గతంలో ఓటర్ ఐడీ కార్డులు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండేవి. కానీ వాటిని తరువాత కలర్‌లో అందివ్వడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీ కార్డుల స్థానంలో నూతనంగా స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులు రానున్నాయి. ఈ క్రమంలోనే ఆ కార్డులను ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటకలో ఓటర్లకు మంజూరు చేస్తోంది. అయితే సదరు కొత్త స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డుల్లో పలు ఫీచర్లను ఈసీ అందిస్తోంది. అవేమిటంటే…

ఎలక్షన్ కమిషన్ నూతనంగా ఇస్తున్న స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డుల‌ను అనేక లేయర్లలో ప్లాస్టిక్‌తో తయారు చేశారు. కార్డుల‌పై ఈసీ హోలోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే ఆ కార్డులకు డూప్లికేట్ కార్డులను తయారు చేయడం ఇక కుదరని పని. ఇక సదరు స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులపై బార్ కోడ్ కూడా ప్రింట్ చేస్తారు. దాన్ని స్కాన్ చేస్తే ఓటరు పేరు, పుట్టిన‌తేదీ, వ‌య‌స్సు, చిరునామా త‌దిత‌ర వివరాలు వస్తాయి. కాగా ప్రస్తుతం 18 ఏళ్లు నిండి నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరు స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను ఇష్యూ చేయనున్నారు. ఈ క్రమంలో వారికి వచ్చే జనవరి 25వ తేదీన ఆ కార్డులు అందనున్నాయి. ఇక కలర్ ఓటర్ ఐడీ కార్డుల మాదిరిగానే ఈ కార్డుల ఇష్యూకు కూడా రూ.30 కనీస ఫీజును వసూలు చేయనున్నారు.

అయితే ప్రస్తుతం కర్ణాటకలోనే ఈసీ కొత్త స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను మంజూరు చేస్తున్నా.. త్వరలో దేశవ్యాప్తంగా ఇవే కార్డులను ఓటర్లకు అందివ్వనున్నారు. ఇక బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నవారు ఈసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, నిర్ణీత ఫీజు చెల్లిస్తే వారికి 15 రోజుల్లో కొత్త స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డు అందుతుందని ఈసీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version