ఫేస్‌బుక్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఇదివరకు కేంబ్రిడ్జి అనాలిటికాకు ఫేస్‌బుక్ తన యూజర్ల డేటాను ఇచ్చిందన్న ఆరోపణలను మరవకముందే మరో ఘటన ఇప్పుడు ఫేస్‌బుక్, దాని యూజర్లను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దాదాపు ఐదు కోట్ల మంది యూజర్స్ డేటా హ్యాక్‌కు గురయింది. ఫేస్‌బుక్‌లోని సెక్యూరిటీ లోపం వల్ల హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌లో ఉండే వ్యూ యాజ్ అనే ఫీచర్‌లో ఉన్న ఎర్రర్‌ను పట్టుకున్న హ్యాకర్లు వ్యూ యాజ్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి డిజిటల్ టోకెన్స్ యాక్సెస్ చేసుకొని యూజర్ల డేటా తస్కరించారు. ప్రస్తుతానికి వ్యూ యాజ్ అనే ఫీచర్‌ను ఫేస్‌బుక్ ఆపేసినప్పటికీ.. హ్యాక్‌కు గురయిన ఆ 5 కోట్ల మంది అకౌంట్లలో ఎవరు ఉన్నారు.. ఎవరు లేరు అనే విషయంపై ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది.
ఫేస్‌బుక్‌లో మొత్తం 2 బిలియన్ అకౌంట్లు ఉన్నాయి. అంటే 200 కోట్లు అన్నమాట. అందులో 9 కోట్ల అకౌంట్లు మాత్రమే ఎఫెక్ట్‌కు గురయ్యాయి. అందులో 5 కోట్లు హ్యాకయ్యాయి. మిగితా 4 కోట్ల అకౌంట్లను మళ్లీ రీబూట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నాలుగు కోట్ల మంది కూడా వ్యూ యాజ్ అనే ఫీచర్‌ను ఉపయోగించిన వాళ్లే.. కానీ.. వాళ్ల అకౌంట్లు హ్యాక్ కాలేదు.
ఒకవేళ మీ అకౌంట్ కనుక హ్యాక్ అయిన 5 కోట్లలో ఒకటి అయి ఉంటే మీకు ఓ నోటిఫికేషన్ వస్తుంది. న్యూస్ ఫీడ్ టాప్‌లో ఆ నోటిఫికేషన్ ఉంటుంది. మీ అకౌంట్ హ్యాక్‌కు గురయిందని.. మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ లాంటివి మార్చుకోవాలంటూ నోటిఫికేషన్ వస్తుంది. మీ అకౌంట్ హ్యాక్ అయితే.. మీ అకౌంట్‌లోని చాటింగ్, కాంటాక్ట్స్, ఫోటోలు, పర్సనల్ మెసేజులు, లైక్స్, కామెంట్స్, పేజీలు అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. థర్డ్ పార్టీ యాప్స్‌ను ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయితే అవి కూడా హ్యాక్‌కు గురయినట్టే. అంటే జొమాటో, ఇన్‌స్టాగ్రామ్, ఓలా, ఇతరత్రా యాప్‌లను ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయితే ఆ యాప్స్ డేటా కూడా హ్యాకర్ల చేతిలో ఉన్నట్టే. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ కాకున్నా మీరు లాగిన్ అయి ఉన్న అన్ని డివైజుల్లో లాగ్ ఔట్ అయి లాగిన్ అయితే సరిపోతుందని ఫేస్‌బుక్ వెల్లడించింది. పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ.. మార్చుకుంటే ఇంకా బెటర్.