ఈపీఎఫ్ హోల్డర్స్ తమ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు.. వంటి కీలక వివరాలు తప్పుగా ఉంటే భయపడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. వాటిని సరి చేసేందుకు గాను ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక ఇందు కోసం గాను జాయింట్ డిక్లరేషన్‌ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే సింపుల్ గా పూర్తి చేసుకోవచ్చు. అదెలాగో పూర్తిగా తెలుసుకుందాం.
ఈపీఎఫ్ కలిగినవారు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల డీటెయిల్స్ ఇందులో సులభంగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, కంపెనీ యజమాని ఇద్దరూ ఈ మార్పును వెరిఫై చెయ్యాలి. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్‌కి సబ్మిట్ చెయ్యాలి. దాని ప్రకారం ఈపిఎఫ్ చందాదారుల వివరాలు అప్‌డేట్ అవుతాయి.
ముందుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.in కు వెళ్లాలి. తరువాత హోం పేజీ టాప్‌లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి. అక్కడ For Employees అనే ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్‌లో Member UAN/ online Service(OCS/OTCP) ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
తరువాత స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దాన్ని ఎంచుకోగానే అందులో జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ మెంబర్ ఐడీని నమోదు చేసి అప్‌డేట్ చేయాలనుకుంటున్న వివరాలను అక్కడ తెలపాలి. అయితే ఇందుకు సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్‌లో ఆ వివరాలనేవి కనిపిస్తాయి. ఆ వివరాలు ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి. ఎంప్లాయర్ కూడా ఆ వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్‌ను పీఎఫ్ కమిషనర్‌కు సబ్మిట్ చెయ్యాలి. దీంతో మీ పని పూర్తవుతుంది. మీ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి.