ఓ వ్యక్తి తన జీవితంలో గెలిచినా.. ఓడినా దాంట్లో అతడి పాత్ర ఎంత ఉంటుందో.. అతడి తల్లిదండ్రులది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే.. తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులు. వాళ్లు ఎలా పెంచితే పిల్లలు అలా తయారవుతారు. పిల్లలను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకునే అధికారం, హక్కు, అవకాశం కేవలం తల్లిదండ్రులకే ఉంది. మరి.. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించే తల్లిదండ్రులు వాళ్లు ఎదగడానికి, వాళ్లకు భవిష్యత్తులో కావాల్సినవి ఏంటో విడమరిచి చెప్పడానికి మాత్రం కాస్త ఆలోచిస్తారు. వాళ్లకు అన్నీ నేర్పిస్తున్నాం అని అనుకుంటారు. కాని.. అవసరాలు తప్పించి అన్నీ నేర్పిస్తారు. అందుకే. ఇప్పుడు మనం తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పించాలో నేర్చుకుందాం పదండి.
టాక్స్ రిటర్నులు ఎలా నింపాలో తెలియజేయండి..
చాలా మందికి డౌట్ రావొచ్చు. పిల్లలకు ఇప్పుడే టాక్స్ రిటర్నుల గురించి ఎందుకు అని. కాని.. సింపుల్ లాజిక్ ఏంటంటే.. అసలు అటు తల్లిదండ్రులు కాని.. ఇటు స్కూళ్లు, కాలేజీల్లో కాని.. టాక్స్ రిటర్నుల మీద ఏమాత్రం అవగాహన కల్పించరు. దీంతో పెద్దయ్యాక టాక్స్ రిటర్నుల వద్ద చాలా మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే వాళ్లకు టాక్సుల మీద అవగాహన కల్పిస్తే.. పెద్దయ్యాక డబ్బులిచ్చి సీఏలతో టాక్సులు నింపించాల్సిన అవసరం రాదు.
ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేయండి..
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అతి గారాబం చేస్తారు. అసలు ఇంట్లో పిల్లలతో ఏ పనీ చేయించరు. దీంతో పిల్లలు బద్ధకస్తులుగా మరతారు. అందుకే..ఇల్లును ఎలా మేనేజ్ చేయాలో వాళ్లకు నేర్పించండి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చెప్పండి. వాళ్లతో చేయించండి. దీంతో వాళ్లలో మేనేజ్ మెంట్ స్కిల్స్ పెరుగుతాయి.
సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం..
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో సెక్స్ విషయాలు చర్చించడానికి మొహమాటపడుతుంటారు. కాని.. తల్లిదండ్రులే చొరవ చూపి పిల్లలతో సెక్స్ గురించి ఎటువంటి మొహమాటం లేకుండా చర్చించాలి. వాళ్లకు తెలపాలి. లేకపోతే వాళ్లు పోర్న్ మూవీస్ లేదా ఫ్రెండ్స్ ఇతరుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికంటే ముందే తల్లిదండ్రులు చొరవ తీసుకుంటే బెటర్.
డబ్బుల పొదుపు, పెట్టుబడి లాంటిపై అవగాహన కల్పించాలి..
ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్‌మనీ అంటూ వేలకు వేలు ఇస్తుంటారు. దీంతో డబ్బుల విలువ తెలియకుండా పిల్లలు కూడా తెగ ఖర్చుపెట్టేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలకు డబ్బుల విలువ తెలియకపోతే జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డబ్బుల విలువ తెలిసేలా పొదుపు, పెట్టుబడి గురించి వాళ్లకు యుక్తవయసులోనే చెబితే డబ్బులను ఎలా ఖర్చుపెట్టాలి.. ఎలా పొదుపు చేయాలి.. ఎలా సంపాదించాలి అనే దానిపై వాళ్లకు ఓ క్లారిటీ వస్తుంది.
చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాల గురించి తెలపండి..
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని బాధపడిపోతుంటారు. వాళ్లు ఎక్కడ చెడు అలవాట్లకు బానిసలుగా మారుతారో అని టెన్షన్ పడుతుంటారు. ఒకవేళ వాళ్లు సిగరేట్, మందు లాంటి వాటికి అలవాటు పడినా వాళ్లను తిట్టకుండా, వాటి వల్ల కలిగే నష్టాలను పిల్లలకు వివరించాలి. చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాల గురించి వాళ్లు తెలుసుకొని మరోసారి అటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. కాని.. వాళ్లును తిట్టికొట్టడం ద్వారా ఒరిగేదేముండదు. దాంతో వాళ్లు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.
అమ్మాయిలకు స్వీయ సంరక్షణ విద్యలు నేర్పించండి..
చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు చాలా షరతులు పెడుతుంటారు. అక్కడికి వెళ్లొద్దని.. ఇక్కడికి వెళ్లొద్దని.. అది చేయొద్దని.. ఇది చేయొద్దని. రాత్రి ఎటూ వెళ్లొద్దని.. ఇలా ఎన్నో రూల్స్ ఉండటం వల్ల వాళ్లు ఏం చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు. దాని వల్ల డిప్రెషన్‌కు కూడా వాళ్లు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల వాళ్లను వాళ్లు సంరక్షించుకునేలా స్వీయ సంరక్షణ విద్యలు నేర్పించండి. వాళ్లు ఎక్కడికి వెళ్లినా.. లేటయినా.. మరే ప్రమాదం ముంచుకొచ్చినా వాటిని దైర్యంగా ఎదుర్కొనేలా అమ్మాయిలను తయారు చేయండి. దీంతో వాళ్లు స్వేచ్ఛగా ఉండొచ్చు. మీరు నిచ్చింతగా ఉండొచ్చు.
పెద్దలు తప్పు చేస్తే ఎదిరించేలా పెంచండి..
చాలా మంది పిల్లలు.. తమ బంధువులు, స్నేహితులు, ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే ఎదురించరు. వాళ్లు పెద్దవాళ్లు కాబట్టి తప్పు చేసిన ఏం అనకూడదనే ఓ భయంతో వాళ్లు పెద్దలను ఎదురించరు. కాని.. పెద్దలయినా.. చిన్నవాళ్లయినా.. తప్పు చేసిన వాళ్లను ఎదురించేలా పిల్లలను పెంచండి.
మగ, ఆడ అని తేడా లేకుండా పెంచండి..
చాలా మంది తల్లిదండ్రులు కొడుకు, కూతురును వేర్వేరుగా చూస్తారు. కొడుకంటే కేవలం బయటికెళ్లి ఆడుకోవాలని.. కూతురయితే.. వంటింటి బొమ్మలతో ఆడుకోవాలని.. అలా షరతులు పెట్టకండి. ఇది 2018. ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉంటే కష్టం. ఈరోజుల్లో ఆడామగా అనే తేడానే లేదు. అంతా ఒకటే. అందుకే ఈ జనరేషన్‌కు అనుగుణంగా పిల్లలను పెంచండి.
రుతుస్రావం గురించి వివరించండి..
రుతుస్రావం లాంటి విషయాల్లో తల్లిదండ్రులు గప్‌చుప్ అంటూ సీక్రెట్ గా ఉంచుతుంటారు. ఇటువంటి విషయాలను కొడుకు, కూతరు ఇద్దరికీ వివరించాలి. రతుస్రావం సైకిల్ గురించి వివరిస్తే ఏ సమస్యా ఉండదు. భవిష్యత్తులోనూ వాళ్లు ఆ విషయంపై అంతగా స్పందించరు. అది అందరికీ కామన్ అనే విషయాన్ని తెలపాలి.
ప్రొఫెషనలిజాన్ని నేర్పాలి..
పిల్లలకు తల్లిదండ్రులు ప్రొఫెషనలిజాన్ని నేర్పించాలి. వాళ్లకు ఏది కరెక్టో.. ఏదో తప్పో వివరించాలి. వాళ్లు ఏ పీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్‌లో వాళ్లను ప్రోత్సహించాలి. మొత్తానికి వాళ్లను ప్రొఫెషనలిస్టులుగా తయారుచేయాలి.