కాటికి కాళ్లు చాపాల్సిన వయసు. ఎప్పుడు ఎక్కడి నుంచి చావు ముంచుకొస్తుందో తెలియని తనం. ఒకరి తోడు లేనిదే అటూ ఇటూ కదలలేని పరిస్థితి. ఇటువంటి స్థితుల్లో ఉన్న ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణా రామా అంటూ ఓ మూలన కూర్చొని తమ శేషజీవితాన్ని గడిపేస్తుంటారు. కాని.. ఓ బామ్మ మాత్రం అలా కాదు. మరెలా? అంటారా.. అయితే స్టోరీ చదవాల్సిందే మీరు.
అది కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన కార్త్యయాని అమ్మ వయసు కేవలం 96. ఈ వయసులో అయితే మనలాంటి వాళ్లు ఏం చేయకుండా మంచం పట్టునే ఉంటాం. కాని.. ఈ అమ్మ మాత్రం అలా కూర్చోలేదు. అందుకే కేవలం 96 ఏళ్లే అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ అమ్మ చేసిందేమింటంటే.. పరీక్షలో ఫుల్ మార్కులను సాధించింది. అవును. ఆ అమ్మ ఇప్పుడు కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ వాళ్లు ఆధ్వర్యంలో జరిగిన అక్షర లక్ష్యం లిటరసీ పరీక్షలో వందకు వంద సాధించింది. ఆ మిషన్ ఆధ్వర్యంలో అమ్మ ఇప్పుడు నాలుగో తరగతి చదువుతున్నది. అంతే కాదు.. పదో తరగతి దాకా చదవడమే తన ధ్యేయమంటూ చెబుతున్నది అమ్మ.
కేరళ అంటేనే తెలుసు కదా. అక్షరాస్యతలో దేశంలోనే టాప్. అయితే.. వృద్ధుల్లో చాలా మంది చదువుకున్న వాళ్లు లేకపోవడంతో బ్యాలెన్స్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మిషన్ ను ప్రారంభించింది. ఆ మిషన్ లోనే ఇప్పుడు కార్త్యాయిని చదువుతున్నది. ఆమెతో పాటు మొత్తం 40,363 మంది వృద్ధులు ఈ మిషన్ ద్వారా తమ చదువును కొనసాగిస్తున్నారు.
అమ్మ తన 12 ఏళ్ల వయసులోనే చదువును వదిలేసింది. వెంటనే గుళ్లలో పని చేయడం ప్రారంభించింది. దాంతో తన చదువుకు పుల్ స్టాప్ పడింది. మళ్లీ 96 ఏళ్ల వయసులో మిషన్ సాయంతో తన చదువును ప్రారంభించింది అమ్మ. అంతే కాదు.. ఎంతో పట్టుదలతో చదివి లిటరసీ పరీక్షలో వందకు వంద మార్కులు తెచ్చుకొని కేరళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని ఊరికే అనలేదు పెద్దలు.