పర్సనల్ లోన్ కు సాధారణంగా 10.99 నుంచి 24 శాతం వరకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వడ్డీని విధిస్తుంటాయి. కనుక వడ్డీపై కూడా కన్నేయాలి. తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణం లభిస్తే మంచిది.
వాహన రుణం కావాలంటే మనం కొనే వాహనమే బ్యాంకుకు సెక్యూరిటీగా ఉంటుంది.. అలాగే హోం లోన్ అయితే ఇల్లు.. ప్రాపర్టీ లోన్ అయితే ప్రాపర్టీలను బ్యాంకులు సెక్యూరిటీగా ఉంచుకుంటాయి. కానీ ఎలాంటి సెక్యూరిటీ, హామీ లేకుండా ఇచ్చేది పర్సనల్ లోన్. ఇది సులభంగానే దొరుకుతుంది. కానీ ఎవరైనా సరే పర్సనల్ లోన్ తీసుకునే ముందు పలు అంశాలను గమనించాల్సి ఉంటుంది. అవేమిటంటే…
1. సాధారణంగా ఇతర ఏ లోన్ అయినా మనకు సులభంగానే లభిస్తుంది. కానీ పర్సనల్ లోన్ రావాలంటే కొంత కష్టపడాలి. ముఖ్యంగా మన సిబిల్ స్కోరు 750కి పైగా ఉండాలి. మనం గతంలో ఏవైనా లోన్లను తీసుకుని ఉంటే వాటిని సరైన టైముకు చెల్లించామా, లేదా, ఏవైనా డ్యూస్ మిగిలి ఉన్నాయా.. ఒక వేళ క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటే వాటి బిల్లులను నెల నెలా సకాలంలో చెల్లిస్తున్నామా, లేదా.. అనే వివరాలను బట్టి సిబిల్ స్కోరు జనరేట్ అవుతుంది. ఈఎంఐ, బిల్లు చెల్లింపులు సక్రమంగా ఉంటే ఎలాంటి దిగులు చెందాల్సిన పనిలేదు. సిబిల్ స్కోరు బాగానే ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా సరే.. పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఒక్కసారి సిబిల్ స్కోరు 750 పైన ఉందా, లేదా చూసుకోవాలి. 750 కన్నా స్కోరు తక్కువ ఉంటే లోన్‌కు అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే లోన్ వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి స్థితిలో లోన్‌కు అప్లై చేస్తే అది రాకపోతే.. అప్పుడు సిబిల్ మరింత తగ్గుతుంది. కనుక 750 కన్నా సిబిల్ స్కోరు తక్కువ ఉంటే పర్సనల్ లోన్‌కు అప్లై చేయరాదు.
2. పర్సనల్ లోన్ కు సాధారణంగా 10.99 నుంచి 24 శాతం వరకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వడ్డీని విధిస్తుంటాయి. కనుక వడ్డీపై కూడా కన్నేయాలి. తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణం లభిస్తే మంచిది. దీంతో రుణం మొత్తం చెల్లించినా పెద్దగా వడ్డీ కట్టాల్సిన పని ఉండదు. అదే వడ్డీ ఎక్కువైతే.. రుణానికి సమానంగా వడ్డీయే చెల్లాంచాల్సి వస్తుంది. కనుక లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట ఎక్కడ తక్కువ ఉందో చూసుకుని మరీ లోన్ తీసుకోవాలి.
3. ప్రస్తుతం మనం ఎలాంటి లోన్ తీసుకున్నా సరే.. 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు, పాక్షిక చెల్లింపు తదితర సేవలపై జీఎస్టీ ఉంటుంది. అయితే వడ్డీ రేట్లపై మాత్రం జీఎస్టీ లేదు. కానీ రుణ చెల్లింపులను ఆలస్యంగా చేసిన పక్షంలో పడే ఫైన్‌కు జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. ఇక లోన్ ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 0.5 శాతం నుంచి 3 శాతం వరకు వసూలు చేస్తుంటాయి. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. కనుక మీరు తీసుకునే వ్యక్తిగత లోనుకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో గమనించాలి. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మీకు అందే రుణం నుంచి ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తారు కనుక, ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉంటే.. మీకు అందే రుణం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని లోన్ తీసుకునే ముందు కచ్చితంగా గమనించాలి.
4. చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీరు ఎంత పర్సనల్ లోన్ తీసుకున్నా సరే.. గరిష్ట పరిమితికి లోబడే ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటాయి. ఇక కొన్ని సంస్థలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే లోన్లను ఇస్తుంటాయి. కనుక అలాంటి సంస్థల నుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిది. ఇక తీసుకున్న లోన్‌ను కాల పరిమితి కాకున్నా ముందుగానే చెల్లించే సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో చాలా వరకు సంస్థలు 12 నెలల వాయిదాలను సరిగ్గా చెల్లించాకే ఈ సదుపాయాన్ని ఖాతాదారులకు అందిస్తుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో మిగిలిన అసలుపై కొన్ని సంస్థలు 5 శాతం వరకు రుసుంను వసూలు చేస్తుంటాయి. ఈ రుసుముపై 18 శాతం జీఎస్టీని కూడా విధిస్తారు.
5. పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈఎంఐ నెలకు ఎంత ఉంటుంది ? మనం సంపాదించేది ఎంత ? ఎంత ఖర్చవుతుంది ? ఈఎంఐకి మిగులుతుందా ? అనే విషయాలను ఒకటికి రెండు సార్లు బేరీజు వేసుకున్నాకే పర్సనల్ లోన్‌ను తీసుకోవడం ఉత్తమం. దీంతో ఈఎంఐ చెల్లింపులను సకాలంలో చేయవచ్చు. సిబిల్ స్కోరుపై ప్రభావం పడకుండా ఉంటుంది. ఇక ఒక్క నెల ఈఎంఐ మిస్ అయినా రూ.450 నుంచి రూ.500 వరకు ఫైన్ పడుతుంది. దీనిపై జీఎస్టీ అదనం. కనుక ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తే ఇలాంటి అపరాధ రుసుముల బెడద లేకుండా ఉండవచ్చు.
6. పర్సనల్ లోన్ తీసుకున్నాక ఒక వేళ అది మీకు అవసరం లేదనుకోండి.. అప్పుడు ఆ లోన్ వద్దనుకున్నా బ్యాంకులకు కొంత రుసుం చెల్లించాలి. చాలా వరకు సంస్థలు రూ.3వేల వరకు ఇలాంటి రుసుంను వసూలు చేస్తున్నాయి. ఇక ఇవే కాకుండా డాక్యుమెంటేషన్, స్టాంపు ఫీజులను అదనంగా చెల్లించాలి. అలాగే రుణానికి బీమా కూడా తీసుకోవాలి. కనుక ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే పర్సనల్ లోన్‌కు అప్లై చేయడం బెటర్. అలాగే ఒకేసారి ఎక్కువ ఫైనాన్స్ సంస్థలకు అప్లికేషన్లు కూడా పెట్టవద్దు. ఎందుకంటే.. అది సిబిల్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎక్కువ లోన్లు మంజూరు అయితే.. వాటి ఈఎంఐలను చెల్లించడం చాలా కష్టతరమవుతుంది. కనుక పర్సనల్ లోన్ తీసుకునే ముందు పైన చెప్పిన అన్ని అంశాలను ఒకసారి పరిశీలించి లోన్‌కు అప్లై చేయాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది..!